లెక్క తేల్చేందుకు..! | - | Sakshi
Sakshi News home page

లెక్క తేల్చేందుకు..!

Feb 26 2026 7:34 AM | Updated on Feb 26 2026 7:34 AM

లెక్క తేల్చేందుకు..!

లెక్క తేల్చేందుకు..!

లెక్క తేల్చేందుకు..!

ఇంటికో యూనిక్‌ కోడ్‌

రెండు దశల్లో జనగణనకు చర్యలు

ఏప్రిల్‌ నుంచి తొలిదశ ప్రారంభం

దీని ఆధారంగానే భవిష్యత్‌ ప్రణాళిక

2011 జనగణన ప్రకారం

పల్నాడు జిల్లా జనాభా 20.42 లక్షలు

సత్తెనపల్లి: జనగణనకు అడుగులు పడుతున్నాయి. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఈసారి జరిగే జనాభా లెక్కలు రెండు దశల్లో జరగనున్నాయి. ఐదేళ్లు ఆలస్యంగా ఈ గణనకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి గత ఏడాది జూన్‌ 15న కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ గణనలో పాల్గొనే అధికారులకు వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు. తొలిదశ ఏప్రిల్‌లో మొదలై సెప్టెంబర్‌ వరకు కొనసాగనుంది. రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలై మార్చి నెలాఖరు నాటికి పూర్తి కానుంది. దీని ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి.

తొలిసారి డిజిటల్‌ విధానంలో...

● జనగణన – 2027లో తొలిసారిగా డిజిటల్‌ విధానాన్ని తీసుకు వచ్చారు. ఇది పేపర్‌, పెన్ను లేకుండా కొనసాగనుంది. ఈ గణనలో పాల్గొనే అధికారులు ట్యాబ్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా పూర్తి సమాచారం సేకరించి సాంకేతిక పద్ధతిలో నిక్షిప్తం చేయనున్నారు. దీనిపై మాస్టర్‌ ట్రైనీలకు శిక్షణ సాగుతోంది. శిక్షణ అనంతరం వీరంతా ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు. జనాభా లెక్కల్లో ఈసారి ప్రజలే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే వెసులు బాటు కల్పించారు. ఆన్‌లైన్‌లో తమ గృహ, కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. తరువాత అధికారులు వీటిని పరిశీలించి నిర్ధారిస్తారు.

రెండవ దశలో వ్యక్తి సమాచారం...

● రెండో దశ జనాభా లెక్కల్లో వ్యక్తి పూర్తి సమాచారం సేకరించనున్నారు. ఆ వ్యక్తి పేరు, ఇంటి యజమానితో అతని సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయసు, జన్మస్థలం, వివాహ స్థితి, ఏ వయసులో వివాహం చేసుకున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, మతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వైకల్యం, మాతృభాష, ఇతర భాషల పట్ల అవగాహన, అక్షరాస్యత, విద్యార్హతలు, ఆర్థిక కార్యకలాపాలు, ఏ పరిశ్రమలో పనిచేస్తున్నారు, వ్యాపారం, ఉద్యోగం వంటి వివరాలను సేకరించనున్నారు.

వాటి ఆధారంగానే...

● దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతోంది. చివరి జనాభా లెక్కలు 2011లో జరిగాయి. నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2021లో జరగాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదాలపై వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ ఏడాది తొలి దేశ మొదలు కానుంది.

● ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, కేంద్ర, రాష్ట్ర ప్రాయోజిత కార్యక్రమాలకు, తీర ప్రాంతాల్లో నిధుల కేటాయింపునకు, వివిధ కార్పొరేషన్ల ద్వారా అందించే రాయితీలు, రుణాలు వంటి వాటికీ యూనిట్ల సంఖ్య నిర్ధారణకు జనాభా లెక్కలే ప్రామాణికం.

● చాలా వాటిని 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల నష్టపోతున్నామని పలు వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. జనాభా, కుటుంబాలు, గృహాలు వంటి వివరాలపై ఇప్పటి వరకూ అంచనాలే తప్ప స్పష్టమైన లెక్కలు లేవు.

● జిల్లాలో జనాభా పై ఒక అంచనాకు రావడానికి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు కొంత వరకు ఉపయోగ పడ్డాయి.

● 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 20.42 లక్షల మంది జనాభా ఉన్నారు. 5.23 లక్షల కుటుంబాలు ఉన్నాయి.

మొదటి దశలో హౌస్‌ లిస్టింగ్‌ గణన నిర్వహించనున్నారు. ఈ దశలో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులపై సమాచారం సేకరించనున్నారు. దీనికోసం పట్టణ, పంచాయతీలను బ్లాక్‌లుగా విడదీయనున్నారు.

ప్రతి ఇంటికి ఒక యూనిక్‌ కోడ్‌ ఇవ్వనున్నారు. వీటిని జనాభా లెక్కల యాప్‌లో నమోదు చేస్తారు. దీనికోసం ప్రతి ఇంటికి సిబ్బంది వెళ్లాల్సిందే. ఇందులో శాశ్వత, తాత్కాలిక నివాస గృహాలు, వాణిజ్య, ప్రభుత్వ భవనాలు వంటి వివరాలు నమోదు చేయనున్నారు. అలాగే ఆస్తుల వివరాలు, ఇళ్లు రకం, గదుల సంఖ్య, తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్ల సౌకర్యం వంటివి ఉన్నదీ లేనిదీ నమోదు చేస్తారు.

వంటగ్యాస్‌, టీవీ, ఫ్రిజ్‌, వాహనం వంటి వివరాలు సేకరిస్తారు. ఇంటర్‌నెట్‌, మొబైల్‌ వాడకం వివరాలు నమోదు చేస్తారు.

జిల్లాలో మొదటి దశ జనగణనలో పాల్గొనే సుమారు వంద మంది మాస్టర్‌ ట్రైనీలకు ఆన్‌లైన్‌లో మూడు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు ఉన్నారు. బ్లాక్‌ల వివరాలతో మ్యాప్‌లు కూడా సిద్ధం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement