నేడు కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం
● తరలిరానున్న లక్షలాది మంది భక్తులు
● కొలువుతీరనున్న
26 భారీ విద్యుత్ ప్రభలు
● విస్తృత ఏర్పాట్లు చేసిన
అధికార యంత్రాంగం
● మూడు వేల మంది సిబ్బందితో
పోలీసు బందోబస్తు
● 618 బస్సులను కొండకు
నడపనున్న ఆర్టీసీ
● పట్టు వస్త్రాలు సమర్పించనున్న
రాష్ట్ర మంత్రి గొట్టిపాటి
నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే తిరునాళ్ల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే తిరునాళ్ల కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో మూడువేల మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను కోటప్పకొండకు నడపనుంది. రాష్ట్ర పండుగ హోదాలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి త్రికోటేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఒంటి గంట నుంచి దర్శనం
త్రికోటేశ్వర స్వామికి శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పుష్పాలంకరణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత, ప్రత్యేక, శ్రీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, అభిషేక దర్శనాన్ని భక్తులకు కల్పించే విధంగా క్యూలైన్‌లు సిద్ధం చేశారు. క్యూలైన్‌లో భక్తులకు ఆరు లక్షల వాటర్ బాటిళ్లు, లక్ష మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాలు అందుబాటులో ఉంచారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులకు విక్రయించేందుకు రెండు లక్షల లడ్డూలు, లక్ష అరిసె ప్రసాదాలను సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది భక్తులకు ఉచితంగా చిన్న లడ్డూలను అందజేయనున్నారు. సుమారు 1.50లక్షల మంది స్వామి దర్శించుకుంటారని అధికారుల అంచనాగా ఉంది. తిరునాళ్ల జాగరణకు ఈ ఏడాది 10 నుంచి 15 లక్షల మంది యాత్రికులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర జరిగే కొండ దిగువు ప్రాంతం లక్షలాది మంది యాత్రికులతో కిక్కిరిసిపోతుంది.
కొలువుతీరనున్న భారీ విద్యుత్ ప్రభలు
ప్రభల పండుగగా పేరుగాంచిన కోటప్పకొండ తిరునాళ్లలో ఈ ఏడాది అధిక సంఖ్యలో విద్యుత్ ప్రభలు భక్తులను కనువిందు చేయనున్నాయి. 26 భారీ విద్యుత్ ప్రభలు కొండకు తరలిరానున్నాయి. వీటితో పాటు 50 చిన్న ప్రభలు, వందకు పైగా మొక్కబడి ప్రభులు కొండకు రానున్నాయి.


