కొండకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా శనివారం కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. సాధారణంగా ఏకాదశి రోజుల కొండలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఏకాదశి రోజున భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా శనివారం ఊహించని విధంగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. నందీశ్వరుడు, నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. మండప అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. బాల ప్రభలతో భక్తులు కొండకు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సోఫాన మార్గంలో మెట్లపూజ చేసుకుంటూ కొండమీదకు చేరుకున్నారు. భక్తుల రద్దీతో ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. తిరునాళ్ల ఏర్పాట్లు పరిశీలించేందుకు వస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దాదాపు 40 నిమిషాలు పాటు కలెక్టర్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో నిలిచిపోయింది.
కొబ్బరికాయ రూ.50
కోటప్పకొండలో దుకాణాదారులు అధిక ధరలకు భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారు. కొబ్బరికాయను రూ.50లకు విక్రయిస్తున్నారు. ఇదేమిటని అడిగితే ఇక్కడి రేటు ఇంతే అంటూ భక్తులపై విరుచుకుపడుతున్నారు. దీంతోపాటు వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్ బాటిల్‌కు రూ.10 అదనపు ధరకు అమ్ముతున్నారు. దీనిపై పలువురు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.


