వెన్ను పోటు బడ్జెట్
● టీడీపీ మేనిఫెస్టోలో
ఇచ్చిన హామీలకు కేటాయింపులేవి?
● మహిళలకు నెల నెలా రూ.1,500
ఆర్థిక సాయం ప్రస్తావనేది!
● నిరుద్యోగులకు మరోసారి
మొండిచేయి
● ఫీజురీయింబర్స్‌మెంట్
బకాయిలపై లేని స్పష్టత
● ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్‌ల ఊసేది!
● కొత్త పింఛన్లు మంజూరు
ఈ ఏడాదీ లేనట్టే
● బడ్జెట్‌లో రైతులకు ఒరిగిందేమీ
లేదంటున్న రైతు సంఘాల నేతలు
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలయ్యే వరకు ఓటరు మల్లన్న, అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న అన్న చందంగా తయారైంది తెలుగుదేశం పార్టీ తీరు. ఎన్నికల్లో గెలవడానికి సూపర్ సిక్స్‌తో పాటు అలవిగాని హామీలను ఎన్నింటినో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తీరా వాటి అమలుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం మొండిచేయి చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మరోసారి నిరాశ మిగిలింది.
సూపర్–6 పథకాలను ఈ ఆర్థిక సంవత్సరమైనా పూర్తిగా అమలు చేస్తారనుకుంటే వాటి ప్రస్తావనే చేయలేదు. నెల నెలా ఆడబిడ్డ నిధి ద్వారా అందజేస్తామ న్న రూ.1,500 కోసం జిల్లాలో 7,80,538 మంది మహిళలు ఎదురుచూస్తున్నారు. వారికి గత రెండేళ్లలాగే ఈసారీ మొండిచేయి చూపారు.
నూతన పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్‌కు అర్హత కల్పించి ఉంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.48 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి వచ్చి ఉండేది. దీని గురించి ప్రస్తావన చేయలేదు.
ఉద్యోగులు, నిరుద్యోగులకు నిరాశే..
ఇంటింటికి ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీ అమలు కోసం జిల్లాలో 6.51 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో వాటి ఊసేలేదని ఆయా వర్గాలు వాపోతున్నాయి.
తల్లికి వందన, సుఖీభవ వంటి పథకాల ప్రస్తావన ఉన్నా వాటికి ఇచ్చిన ఆరకొర నిధులతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందేమోనన్న భయం ప్రజల్లో మొదలైంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా ఉండగా కేటాయింపులు అరకొర చేసి మరోసారి పెండింగ్‌లో ఉంచేలా చేశారు. దీంతో విద్యార్థుల చదువులు ప్రమాదంలో పడనున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూసిన పీఆర్సీ, ఐఆర్‌ల ఊసే లేకపోవడంతో ఆయా వర్గాలు మండిపోతున్నాయి. పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాకు ఏం చేస్తున్నారో పేర్కొనలేదు.


