హై లెవల్ బ్రిడ్డి నిర్మాణమెప్పుడో?
ముంపును ఆపలేకపోయిన కాంక్రీట్ కాలువ
● బ్రిడ్జి నిర్మాణంతో సమస్యకు పరిష్కారం
● తుఫాన్‌లు, భారీవర్షాలకు
మునుగుతున్న సత్తెనపల్లిరోడ్డు చప్టా
● గంటల తరబడి ప్రజల
రాకపోకలకు కష్టం
● ముంపునకు గురవుతున్న
నివాస ప్రాంతాలు
● బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు
పంపామంటున్న అధికారులు
నరసరావుపేట: సత్తెనపల్లి రోడ్డులోని కత్తవ వాగుపై ఉన్న చప్టా స్థానంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు చప్టాపై మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు ప్రవహించింది. సుమారు 12గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 2017లో కురిసిన వర్షాల కారణంగా ఇదే చప్టాపై సుమారు పది అడుగుల నీరు పారింది. దీంతో చప్టాపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చర్చకు వచ్చింది.
కాలనీలను ముంచెత్తుతున్న వరద
చప్టా ఎత్తు తక్కువగా ఉండటం, నీరు పారే ఖానాలు చిన్నవిగా ఉండటంతో పైనుంచి వచ్చే వర్షపు నీరు చప్టా తూముల గుండా ప్రవహించేందుకు అవకాశం లేక పైగుండా ప్రవహిస్తుంది. దీని వలన రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతోపాటు సమీపంలోని చంద్రబాబునాయుడు కాలనీ, క్రీడల స్టేడియం, బరంపేట ప్రాంతాలను ముంచెత్తుతుంది.
ఐదు గ్రామాలకు ఏకై క మార్గం
నరసరావుపేటకు సత్తెనపల్లి రోడ్డు మార్గం చాలా ముఖ్యమైంది. నరసరావుపేట మండలంలోని ఇసప్పాలెం, ములకలూరు, పెదరెడ్డిపాలెం, పమిడిపాడు, కేఎం అగ్రహారం గ్రామాలతోపాటు పట్టణంలోని బీసీ కాలనీ, సాయినగర్‌లకు ఏకై క మార్గం. ఈ ప్రాంతాల్లో సుమారు 40వేల మందికిపైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరందరూ పట్టణంలోకి ప్రవేశించేందుకు ఇదోక మార్గం. చప్టాకు దగ్గరలో క్రీడల స్టేడియం, ఇసప్పాలెం గ్రామంలో భక్తులకు కొంగుబంగారమైన శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం ఉన్నాయి. ప్రతి ఆదివారం పట్టణంలోని వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ఇంతటి ముఖ్యమైన మార్గంలో ఉన్న ఈ చప్టాపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం అత్యవసరంగా కన్పిస్తుంది. వర్షాలు కురిసి వరద వచ్చిన సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ బ్రిడ్జి అవసరం తలుచుకోవటం, ఆ తర్వాత దాని ఉసే ఎత్తకపోవటం జరుగుతుంది.
సత్తెనపల్లిరోడ్డులోని బీసీ కాలనీ వెనుకవైపు నుంచి వచ్చే వర్షపు నీటితో డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం తరచూ ముంపునకు గురవుతుంది. 2017లో కురిసిన వర్షాలకు స్టేడియం మొత్తం నీరు చేరింది. ముంపును నివారించేందుకు కాంక్రీటు కాలువ నిర్మించాలని నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వంలో సుమారు రూ.2 కోట్లకు పైగా వ్యయం చేసి కత్తవ వాగులో కాంక్రీట్ కాలువ నిర్మించారు. కాంక్రీట్ కాలువ స్టేడియం ముంపును నివారించలేకపోయింది. మోంథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు స్టేడియంలోకి ప్రవేశించే మార్గంతోపాటు స్టేడియం లోపల భారీగా నీరు చేరింది. ఇప్పటికే స్టేడియం బాగోగులను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ఆనవాళ్లు కోల్పోయింది. మైదానంలోకి నీరు చేరటంతో క్రీడాకారులకు నిరాశే మిగిలింది.
హై లెవల్ బ్రిడ్డి నిర్మాణమెప్పుడో?


