నవధాన్యాల సాగుతో నేల తల్లిని బాగు చేద్దాం
నార్నెపాడు(ముప్పాళ్ళ): ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాలు సాగు చేసి నేల తల్లిని బాగు చేయవచ్చని ప్రకృతి వ్యవసాయం జిల్లా అధికారి నందకుమార్ చెప్పారు. మండలంలోని నార్నెపాడు గ్రామంలో బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నందకుమార్ మాట్లాడుతూ అంతర పంటలు వేయడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. భూమిలోని సూక్ష్మజీవుల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తద్వారా భూమి సారవంతం అవుతుందన్నారు. సత్తెనపల్లి డివిజన్ మాస్టర్ ట్రైనర్ కంచర్ల మధుబాబు మాట్లాడుతూ పీఎండీఎస్ (ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) సాగు చేయడం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు అందుతాయని తెలిపారు. కొంత కలుపు ఉధృతిని తగ్గించుకోవచ్చన్నారు. గ్రామంలోని మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకు వెళ్లేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వీఏఏ ప్రియాంకరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామపెద్దలు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది స్వాతి, పూజ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


