నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటులో భాగంగా సింగిల్ డెస్క్ పోర్టల్‌పై ఈ నెలలో వచ్చిన 129 దరఖాస్తులకు గాను 122ను ఆమోదించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.సుధాకర్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పలు అంశాలపై జేసీ సమీక్ష చేశారు. సింగిల్ డెస్క్ పోర్టల్ క్లియరెన్స్, ఎస్సీ, ఎస్టీలకు పెట్టుబడి రాయితీ, పారిశ్రామిక అభివృద్ధిలో రాయితీ విధానం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన, సులభతర వ్యాపారంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, క్లస్టర్ డెవలప్‌మెంటు ప్రోగ్రాం తదతర పలు అజెండాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కేవైసీ ద్వారా దరఖాస్తుల ప్రాసెస్ వేగవంతంగా చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో ఇప్పటి వరకు 4950 మందికి శిక్షణ ఇచ్చామని, 3,357 దరఖాస్తులను బ్యాంకులకు పంపించామని జేసీ తెలిపారు. ఇందులో 521 మంజూరై 452 యూనిట్లకు రుణాలు విడుదల చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.