అడ్డదారిలో తగ్గేదేలే ! | - | Sakshi
Sakshi News home page

అడ్డదారిలో తగ్గేదేలే !

Published Thu, Mar 20 2025 2:37 AM | Last Updated on Thu, Mar 20 2025 2:36 AM

సాక్షి , టాస్క్‌ఫోర్స్‌ : కూటమి ప్రభుత్వం అక్రమార్కులకు వరంగా మారింది. అడ్డదారిలో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రభుత్వానికి రాయల్టీలు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందులో కూటమి నేతలు కూడా భాగస్వాములుగా చేరి బరితెగిస్తున్నారు. అడ్డ‘దారి’లో తగ్గేదేలే ! అంటూ విర్రవీగుతున్నారు. తమను అడ్డుకునేదెవరూ అంటూ రెచ్చిపొతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చే గ్రానైట్‌ లారీలను రాష్ట్ర సరిహద్దు దాటిస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండల పరిధిలోని రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల మీదుగా రోజుకి 50కి పైగా లారీలు దాటిపోతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి చేరుతోంది.

సరిహద్దు దాటించేందుకు భారీ వసూళ్లు

ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, మార్టూరు ప్రాంతాల్లో గ్రానైట్‌ పుష్కలంగా ఉంది. లారీల ద్వారా తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాలకు అక్రమార్కులు తరలిస్తున్నారు. జాతీయ రహదారులపై అధికారులు తనిఖీలు చేసే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో దాటేలా స్కెచ్‌ వేశారు. చీమకుర్తి, మార్టూరు ప్రాంతాల్లో లారీ బయలుదేరగానే సరిహద్దు దాటించే అక్రమార్కులకు ముందుగానే సమాచారం అందిస్తారు. గురజాలకు గ్రానైట్‌ లారీ వచ్చిన తరువాత అక్కడే బేరం కుదుర్చుకుంటారు. ఒక్కొ లారీకి రూ.40వేల నుంచి రూ.60వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తారు. కూటమి నేతలు ఒక గ్యాంగ్‌గా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నారు. వీళ్ల కళ్లుగప్పి గ్రానైట్‌ లారీ సరిహద్దు దాటితే వెంటబడి, బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడతారు. మామూళ్లు ఇవ్వకపోతే అధికారులకు వీరే ఫోన్లు చేసి పట్టిస్తారు.

గురజాలలో బేరసారాలు

అక్రమాలకు పాల్పడే వారు సైతం ఎస్కార్ట్‌ వాహనాలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా పోలీసులు, మంత్రుల వాహనాలకు పోలీస్‌ సైరన్లు ఉంటాయి. కానీ గ్రానైట్‌ వాహనాలను సరిహద్దు దాటించే అక్రమార్కుల వాహనాలకు ఈ సైరన్లు అమర్చుకున్నారు. చీమకుర్తి, మార్టూరు నుంచి గ్రానైట్‌ వాహనాలు నకరికల్లు మీదుగా కారంపూడి అక్కడ నుంచి గురజాలకు వస్తాయి. అక్రమార్కులు వాహనం వద్దకు వెళ్లి బేరాలు మాట్లాడుకుని గురజాల నుంచి పులిపాడు, శ్రీనివాసపురం, పొందుగల మీదుగా రాష్ట్ర సరిహద్దు దాటిస్తారు. గ్రానైట్‌ వాహనాలకు ముందుగా కార్లలో, ద్విచక్ర వాహనాల్లో వెళతారు. అధికారులు ఉన్నారా..లేదా ? అని ఆరా తీస్తారు. కిందిస్థాయి సిబ్బంది ఉంటే కొంతముట్టజెప్పి సరిహద్దు దాటిస్తుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇటువంటి అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఒకవేళ లారీలను మైనింగ్‌, వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఆపితే బెదిరింపులకు పాల్పడుతున్నారు.

సరిహద్దు దాటుతున్న గ్రానైట్‌, ఇసుక గురజాల వయా శ్రీనివాసపురం మీదుగా రవాణా లారీలను దాటించి సొమ్ము చేసుకుంటున్న కూటమి నేతలు ఒక్కో లారీకి రూ.40వేలకుపైగా వసూలు రోజుకి 50 లారీలకు పైగా రవాణా ఎస్కార్ట్‌ వాహనాలతో ఓ గ్యాంగ్‌ పహరా ప్రభుత్వ ఆదాయానికి గండి

ఇసుక లారీలు రైట్‌ రైట్‌

ఇసుక లారీలుసైత సరిహద్దులు దాటిపోతున్నాయి. అచ్చంపేట, క్రొసూరు రీచ్‌ల నుంచి కూటమి సైన్యమే సరిహద్దు దాటిస్తోంది. ఒక్కో లారీకి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. రోజుకి 40కిపైగా ఇసుక లారీలు అక్రమంగా సరిహద్దు దాటుతున్నాయి. ఇటీవల అధికారులు దాడులు చేసి గ్రానైట్‌, ఇసుక లారీలను పట్టుకున్నారు. పెనాల్టీలు చెల్లించిన తరువాత వదిలేయడం గమనార్హం

అడ్డదారిలో తగ్గేదేలే ! 1
1/2

అడ్డదారిలో తగ్గేదేలే !

అడ్డదారిలో తగ్గేదేలే ! 2
2/2

అడ్డదారిలో తగ్గేదేలే !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement