రివల్‌కోన వసతి పాఠశాల ఘటనపై పరిశీలన
రాయగడ: జిల్లాలో విద్యార్థుల భద్రత, బాలల హక్కుల పరరిక్షణ అంశాలపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. కమిషన్ చైర్ పర్సన్ బబితా పాత్రోతో పాటు సభ్యురాలు సుజాత నాయక్ సెప్టెంబరు 2,3 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల రివల్‌కోన ఉన్నత పాఠశాల వసతి గృహంలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడిన నేపథ్యంలో కమిషన్ ప్రతినిధుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటలో భాగంగా కొలనార సమితి పరిధిలోని రివల్‌కొన లో ఉన్న ఎస్‌సి, ఎస్టీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత పాఠశాలను కమిషన్ చైర్ పర్శన్, సభ్యురాలు సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, భద్రత పరిస్ధితులను తెలుసుకోవడంతో పాటు ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించే అవకాశం ఉంది.
విద్యార్థులపై దాడి వీడియో వైరల్
ఈ నెల మొదటి వారంలో రివల్‌కోన ఉన్నత పాఠశాలలోని ఓ సీనియర్ విద్యార్థి మరి కొందరి సహచరులతో కలిసి జూనియర్ విద్యార్థులను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చందిలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. అనంతరం ఏడుగురు విద్యార్థులకు టీసీలు ఇచ్చి పాఠశాల నుంచి బహిష్కరించారు. క్రికెట్ ఆటకు సంబంధించి విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఈ ఘటనకు కారణమైందని అప్పట్లో అధికారులు వెల్లడించారు. కొంతమంది జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులపై ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన సీనియర్లు 20 మందికి పైగా వసతి గృహ విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు వైరల్ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. గతంలోనూ సీనియర్ విద్యార్థులు జూనియర్‌లను వేధిస్తున్నారనే ఆరోపణలు రావడం గమనార్హం.
పలు బాలల సంక్షేమ సంస్థల్లో తనిఖీలు
రివల్‌కోన పాఠశాల సందర్శనతో పాటు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, శిశు సంరక్షణ సంస్థలు, ఇతర బాలల సంక్షేమ సంస్థలను కమిషన్ ప్రతినిధులు సందర్శించనున్నారు. ఆస్పత్రులు, పాఠశాలలు, టీహెచ్‌ఆర్ యూనిట్లను కూడా ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు సమాచారం.
వరుస ఘటనల నేఽపథ్యంలో ప్రాధాన్యత
గత కొంత కాలంగా జిల్లాలోని పలు వసతి పాఠశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో కమిషన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలోని అంబొదల ఉన్నత పాఠశాల ఘటన, ముకుందపూర్ ఉన్నత పాఠశాలలో పరీక్షల్లో కాపీలు అందించిన ఘటన, డంగసొరొడ విద్యార్థి అదృశ్యం, మలేరియాతో విద్యార్థుల మృతి, బుడాగుడ ఉన్నత పాఠశాల విద్యార్థి నీటిలో మునిగి మృతి వంటి ఘటనలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, ముఖ్యంగా వసతి పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ప్రమాణాలు, అధికారుల పర్యవేక్షణ వసతి గృహాల నిర్వహణ తదితర అంశాలపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు చట్టపరంగా ఉన్న అధికారాల నేపథ్యంలో ఈ పర్యటనను అధికారులు కూడా కీలకంగా భావిస్తున్నారు. కమిషన్ చైర్‌పర్శన్ పర్యటనకు సంబంధించి రాయగడ కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర జిల్లాస్థాయి అధికారులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలిసింది.


