ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తున్న వైనం
రాయగడ: తమ భాష, లిపి, సంస్కృతి పరిరక్షణతో పాటు ఆశ్రమంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల పోషణకు సబర గిరిజనులు చేస్తున్న సామూహిక కృషి ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లాలోని గుణుపూర్ సమితి పరిధిలో ఉన్న టిటిమిరి పంచాయతీ ఎంగెర్భ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్పీ మంగాయి ఆశ్రమం నిర్వహణ ఖర్చుల కోసం పరిసర ప్రాంతాల్లోని 14 గ్రామాల సబర గిరిజనులు క్రమం తప్పకుండా శ్రమదానం చేస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారు. ఆశ్రమ నిర్వహణ కోసం సంఘం ప్రత్యేకంగా ఉపనియమాలను రూపొందించింది. ఆ నిబంధనల ప్రకారం ప్రతీ గురువారం అక్షర బ్రహ్మ మత్తారావనం పూజ సందర్భంగా 14 గ్రామాలకు చెందిన ప్రజలు ఆశ్రమ ప్రాంగణంలో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నెలకొన్న సమస్యలు, అవసరాలపై చర్చించి వాటి పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సమస్య పరిష్కారానికి ఆర్థిక అవసరం ఏర్పడితే మరుసటి రోజున గ్రామస్తులు సమూహంగా శ్రమదానం చేసేందుకు బయలు దేరుతారు. ప్రస్తుతం వరి నాట్లు వేసే సీజన్ కావడంతో 14 గ్రామాలకు చెందిన సబర గిరిజనులు సుదూరంలోని మారిగుడ గ్రామానికి వెళ్లి వరి నాట్లు వేస్తున్నారు. వరి నాట్ల ద్వారా వారు పొందే కూలి మోత్తాన్ని ఆశ్రమ నిర్వహణ కోసం సంఘం అధ్యక్షుడికి అందజేయనున్నారు. ఇలా తమ శ్రమతో సంపాదించిన మొత్తాన్ని ఆశ్రమ నిర్వహణకు కేటాయిస్తు విద్యార్థుల చదువు, వసతి, భోజనం తదితర అవసరాలకు అండగా నిలుస్తున్నారు. తమసొంత భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆశ్రమం, హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు పేద సబర గిరిజన సమాజం చేస్తున్న ఈ సామూహిక శ్రమదానం, సేవాభావం నిజంగా ప్రశంసనీయంగా పలువురు అభినందిస్తున్నారు.


