పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు | - | Sakshi
Sakshi News home page

పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు

Apr 25 2026 9:36 AM | Updated on Apr 25 2026 9:36 AM

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంలో కలెక్టర్‌ కులకర్ణి

రాయగడ: పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలని అటువంటి పల్లెల సమగ్రాభివృద్ధికి పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి అన్నారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయం సమావేశం మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పడటానికి గల కారణాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో గల ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించే విషయంలో పంచాయతీరాజ్‌శాఖ పని చాలా కీలకమన్నారు. అందువల్ల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో విధులు నిర్వహించే ఇటు ప్రభుత్వ అధికారులతోపాటు అటు ప్రజాప్రతినిధులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మంజూరు చేసే వివిధ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ్‌కుమార్‌ ఖెముండొ అతిథులకు స్వాగతం పలికారు. జిల్లా పరిషత్‌ ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ప్రత్యేక అభివృద్ధి మండలి (ఎస్‌డీసీ) చైర్మన్‌ బిద్యాధర్‌ సబర్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజులా మినియాక ప్రసంగించారు. పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురష్కరించుకుని జిల్లాలో ఉత్తమ సేవలను అందించే సంస్థలకు బహుమతులను ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లాలోని గునుపూర్‌ పంచాయతీ సమితి ఉత్తమ సమితిగా బహుమతిని సొంతం చేసుకుంది. సమితి చైర్మన్‌ జిల్లి సబర్‌కు కలెక్టర్‌ జ్ఞాపికను అందించి సత్కరించారు. ఉత్తమ ఏఈగా రామనగుడ సమితికి చెందిన త్రినాథ్‌ మిశ్రా, ఉత్తమ పీఈఓగా మునిగుడ సమితిలోని ఇచ్ఛాపూర్‌ గ్రామ పంచాయతీ పీఈఓగా విధులు నిర్వహించే మనోరంజన్‌ బెహరా, ఏడీఈఓ గునుపూర్‌ సమితి సగడ పంచాయతీకి చెందిన జగదీష్‌ పత్రిక,ఉత్తమ జీఆర్‌ఎస్‌గా రామనగుడ సమితిలోని గొగుపాడు పంచాయతీకి చెందిన ఇరామాఝి సంతోష్‌ కుమార్‌, ఉత్తమ ఎఫ్‌పీఓగా కొలనార నారీశక్తి అగ్రొ ప్రొడ్యూసర్‌ కంపెనీ, అదేవిధంగా ఉత్తమ ఎస్‌హెచ్‌జీ కొలనార సమితిలోని ఇందిరా స్వయం సహాయక బృందాన్ని సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement