రాయగడ: అత్యంత వెనుకబడిన సమితిగా గుర్తింపు పొందిన గుడారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించే విషయంలో అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని బీడీఓ సుచిస్మిత బెహరా అన్నారు. గురువారం సమితీ సమీక్ష సమావేశం సమితి అధ్యక్షుడు బిఽశ్వనాథ్ సబర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో భాగంగా బీడీఓ బెహరా మాట్లాడుతూ.. సమితిలో గల ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో గల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్య, వైద్యం, తాగు, సాగునీటి వంటి సౌకర్యాలను మెరుగుపరిచే విషయంలో అంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ ఎ.స్నేహలత, ఎమ్మెల్యే ప్రతినిధి సురేష్ ఆచార్య, ఎంపీ ప్రతినిధి పి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జీపీడీఓ శివప్రసాద్ పండా సమితి వార్షిక నివేదికను చదివి వినిపించారు. సమితి పరిఽధిలో గల మధుబన్ పంచాయతీలో ఎన్నో విద్యాలయాలు సకాలంలో తెరవకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుపడుతుందని సర్పంచ్ వంశీ సబర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.


