రామస్థూపానికి పంచామృత అభిషేకం
రాయగడ: జేకేపూర్‌లో గల శ్రీభూసమేత కల్యాణ వేంకటేశ్వర మందిరంలో ఈ నెల 23 వ తేదీ నుంచి కొనసాగుతున్న స్వర్ణోత్సవాల్లో భాగంగా గురువారం మందిరం ప్రాంగణంలో గల రామస్థూపానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించిన వేదపండితులు గోపూజ విశేష హోమాలు పూర్తయ్యాక మందిరం ప్రాంగణంలో గల రామస్థూపానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ ప్రాంతంలో గల కొంతమంది భక్తులు భక్తిశ్రద్ధలతో రామకోటి రచించి పుస్తకాలను ఒకే ప్రాంతంలో సమకూర్చి దానిపై ఈ స్థూపాన్ని నిర్మించారు. దీంతో ఈ స్థూపానికి రామ స్థూపంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి ప్రతి వార్షికొత్సవాల్లో ఈ స్థూపం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ అభిషేక పూజల్లో మందిరం కమిటీ అధ్యక్షుడు, జేకే పేపర్ మిల్ ఉపాధ్యక్షుడు (కమర్షియల్) వినయ్ ద్వివేది, ప్రముఖ న్యాయవాది హరిచందన్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మందిరం ప్రాంగణంలో గల కల్యాణమండపంలొ సామూహిక తులసీ దళ అర్చనలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. వచ్చే భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు.
ఇదిలాఉండగా బుధవారం సాయంత్రం ఉత్సవాలను పురష్కరించుకుని ఉత్సవ వేదిక వద్ద వివిధ సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన బాల కళాకారులు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుడు, సీతారామ, లక్ష్మణ ఆంజనేయుల వేషధారణలతో పాటు చిన్నారులు చేసిన జానపద నృత్యాలతో వేదిక ఆకట్టుకుంది. అనంతరం మందిర కమిటీ ఉపాధ్యక్షుడు పట్నాన గౌరి శంకరరావు, కాశీపూర్‌లో గల మైత్రీ ఇన్‌ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ తదితర ప్రముఖులు కళాకారులను సన్మానించారు. అదేవిధంగా జేకేపూర్ పరిసర ప్రాంతాల్లొ ఉన్న వివిధ దేవాలయాలకు చెందిన పురోహితులను ఈ సందర్భంగా వేదికపై ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు.
రామస్థూపానికి పంచామృత అభిషేకం
రామస్థూపానికి పంచామృత అభిషేకం
రామస్థూపానికి పంచామృత అభిషేకం
రామస్థూపానికి పంచామృత అభిషేకం
రామస్థూపానికి పంచామృత అభిషేకం


