కేరళలో వలస కార్మికుడి మృతి
రాయగడ: ఉపాధి కోసం కేరళ వెళ్లిన వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని కాసీపూర్ సమితి శుంగేర్ పంచాయతీలోని బొండేయి గ్రామానికి చెందిన సంతోష్ నాయక్ (39)గా గుర్తించారు. మూడు నెలల క్రితం కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఉపాధి కోసం కేరళ రాష్ట్రం వెళ్లాడు. ఆ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలోని ఎదబానాపురం ప్రాంతంలో ఒక హోటల్‌లో పని చేస్తుండేవాడు. శుక్రవారం రాత్రి సంతోష్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో తోటి స్నేహితులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సమాచారాన్ని సంతోష్ కుటుంబీకులకు అందించారు. సంతోష్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు తీవ్ర విషాదానికి గురయ్యారు. మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం అందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కాసీపూర్‌లోని యువకులు గత కొద్ది ఏళ్లుగా ఉపాధి కోసం వెళ్లి మృత్యువాత పడుతుండడం పరిపాటిగా మారింది. జిల్లాలో బృహత్తర పరిశ్రమలు ఉన్నప్పటికీ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో వలస కార్మికులుగా మారి ఇంటికి విగతజీవులుగా తిరిగి రావడం విచారకరం.
కేరళలో వలస కార్మికుడి మృతి


