యూత్ రిసోర్స్ కేంద్రం ప్రారంభం
రాయగడ: విద్యావంతులైన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ మేరకు జేకేపూర్‌లోని జేకే పేపర్ మిల్‌కు చెందిన స్పర్స్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా శనివారం యూత్ రిసోర్స్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యావంతులైన యువతులకు ఈ కేంద్రంలో ఉచితంగా ఎస్‌ఎస్‌సీ, రైల్వే, ఓఎస్‌ఎస్‌సీ, పోలీస్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ కల్పిస్తుందన్నారు. తొమ్మిది నెలల పాటుగా కొనసాగే ఈ శిక్షణలో భాగంగా గణితం, జనరల్ నాలెడ్జి, ఇంగ్లిష్, ఒడియా గ్రామర్, కంప్యూటర్ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కల్పించడం జరుగుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అవకాశాల అంతర్యాన్ని తగ్గించడంలో ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జేకే పేపర్ మిల్ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు బిశ్వజీత్ ద్వివేది, మేనేజర్ ఆదిత్యా పట్నాయక్, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చనా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువతులకు శిక్షణకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు.


