‘వందేమాతరం’ బహుమతుల ప్రదానం
రాయగడ: జాతీయ గేయం వందేమాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అధికారయంత్రాంగం బహుమతులను ప్రదానం చేసింది. మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక బిజూపట్నాయక్ అడిటోరియంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, గౌరవ అతిథిగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్తుల మధ్య నిర్వహించిన వక్‌ృత్వ, చిత్రలేఖనం, వందేమాతరం గానం తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు. అనంతరం నవీన్ నాయక్ మాట్లాడుతూ.. దేశ సమైక్యతకు అద్దం పట్టే ఈ గానంలో మాధుర్యం ఎంతో నిండిఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సుస్మిత బౌరి పాల్గొన్నారు.


