పాత్రికేయుడి మృతికి సంతాపం | - | Sakshi
Sakshi News home page

పాత్రికేయుడి మృతికి సంతాపం

Jan 17 2026 7:36 AM | Updated on Jan 17 2026 7:36 AM

పాత్ర

పాత్రికేయుడి మృతికి సంతాపం

రాయగడ: స్థానిక గాంధీనగర్‌ మూడో లైన్‌లో నివాసముంటున్న పాత్రికేయుడు అశుతోష్‌ పట్నాయక్‌ (53) గుండెపోటుతో మృతి చెందారు. ఒడియా వెబ్‌ ఛానెల్‌లో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న పట్నాయక్‌ శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అశుతోష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పాత్రికేయులు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రాయగడ ప్రింట్‌ అండ్‌ మీడియా వెల్ఫేర్‌ కమిటీ సభ్యునిగా వ్యవహరిస్తున్న అశుతోష్‌ పట్నాయక్‌ అకాల మృతికి శనివారం స్థానిక సంస్కృతి భవన్‌లో సంతాప సభ నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధి శివాజీ దాస్‌ తెలిపారు.

గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం

మల్కన్‌గిరి: జిల్లా కేంద్రం పాతపోస్టాఫీస్‌ వీధిలో గురువారం పూజ కోసం వంట చేస్తుండగా బి.ప్రకాశరావు ఇంటిలో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వంటింటిలో ఉన్న సామాన్లు కాలిపోయి భారీగా నష్టం వాటిల్లింది. కుటుంబ సభ్యులు పిండి వంటలు చేస్తుండగా ప్రమాదం జరిగింది.

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

మల్కన్‌గిరి: కోరుకొండ సమితి సిరాగూడ చౌక్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఎస్‌ఐ మహాప్రసాద్‌ నాయిక్‌ నేతృత్వంలో పట్టుకుంది. డ్రైవర్‌ త్రినాథ్‌ ఖిలో సరైన పత్రాలు చూపించకపోవడంతో కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు ఐఐసీ ఆర్‌.విజయ్‌కుమార్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ గజరాజు మృతి

భువనేశ్వర్‌: ఢెంకనాల్‌ కపిలాష్‌ ఏనుగుల చికిత్స కేంద్రంలో చికిత్స దిశలో గజరాజు మరణించినట్లు వైద్య బందం ప్రకటించింది. పేలుడు పదార్థం సేవించి తీవ్రంగా గాయపడిన ఏనుగు పరిస్థితి క్షీణించడంతో ఏనుగుల చికిత్స కేంద్రానికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగా శుక్రవారం ఉదయం మరణించింది. అంగుల్‌ అటవీ డివిజన్‌ పరిధిలోని బొంతొల అటవీ ప్రాంతంలోని పొథొరొగొడొ సాహి సమీపంలో ఈ ఏనుగుని విషమ స్థితిలో గుర్తించారు. ఐదు, ఆరు రోజుల కిందట పేలుడు పదార్థం తినడంతో తీవ్రంగా గాయపడిందని సీనియర్‌ పశు వైద్యుడు డాక్టర్‌ ప్రదీప్త కుమార్‌ సింగ్‌ ధ్రువీకరించారు. ఈ పేలుడు కారణంగా ఏనుగు నోటి లోపల లోతైన గాయాలయ్యాయి. కపిలాష్‌, అంగుల్‌, సతొకొసియా నుంచి ప్రత్యేక పశువైద్య బందాలు నిమగ్నమై చేసిన చికిత్స ప్రయత్నాలు విఫలమయ్యాయి. వేటగాళ్లు పన్నిన ఉచ్చుతో గజరాజు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుని ఉంటుందని అంగుల్‌ మండల అటవీ శాఖ అధికారి పేర్కొన్నారు. అయితే కచ్చితమైన పరిస్థితులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి.

లారీ డ్రైవర్‌ మృతి

రాయగడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడకు చెందిన లారీ డ్రైవర్‌ జి.తాతాజీ (30) శుక్రవారం సదరు సమితిలోని కొత్తపేట వద్ద గుండెపోటుకు గురై మృతిచెందాడు. నువాపడ నుంచి కాకినాడకు వెళుతుండగా తీవ్ర అస్వస్థతకు గురై లారీ కింద పడిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికి గుండె పోటుతో మృతి చెందాడు. చందిలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పాత్రికేయుడి మృతికి సంతాపం 1
1/1

పాత్రికేయుడి మృతికి సంతాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement