రోడ్డు ప్రమాదంలో వలస కార్మికుడి మృతి
రాయగడ: రోడ్డు ప్రమాదంలో వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని కాసీపూర్ సమితి కుచేయిపొదొరొ గ్రామానికి చెందిన లింగరాజ్ మాఝి కొడుకు గురునాథ్ మాఝి (25) గా గుర్తించారు. కొద్ది నెలల క్రితం గురునాథ్ ఉపాధి కోసం పొరుగు రాష్ట్రమైన కేరళకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కంపెనీలో పనులు ముగించుకుని అతడు నివసించే ప్రాంతానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని కేరళలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తోటి స్నేహితులు బాధితుని కుటుంబానికి తెలియజేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఆటో – బైక్ ఢీకొని...
చందిలి పోలీస్‌స్టేషన్ పరిధి కొత్తపేట గ్రామ సమీపంలో శుక్రవారం ఆటో – బైకు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాలకు గురయ్యారు. మృతుడు లంకా సుధ (53)గా పోలీసులు గుర్తించారు. గాయాలు తగిలిన వ్యక్తి సుధ కొడుకు శ్యామ సుందర్‌గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, గాయాలు తగిలిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సదరు సమితి కురుంపేటకు చెందిన లంకా సుధ, అతని కొడుకు శ్యామ్ సుందర్‌లు కనుమ పండగను పురస్కరించుకుని తన బంధువులు ఉంటున్న రాయగడకు తమ స్వగ్రామం నుంచి బైకుపై శుక్రవారం బయల్దేరారు. కొత్తపేట సమీపంలో ఒక ఆటో అదుపుతప్పి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో సంఘటన స్థలం వద్దే సుధ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


