రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో ప్రతిభ
జయపురం: బరంపురంలో 9వ రాష్ట్ర నాటక మంచ్, 35వ గంజాం జిల్లా కళాపరిషత్ మంచ్ కళాకారులు కలిసి నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో జయపురం సంస్కృతిక సంస్థ జయపురం వారు ప్రదర్శించిన నాటకం ‘మా లో చాంబర్’ విజయ దుందిబి మోగించి జయపురానికి నూతన సంవత్సర కానుగా తీసుకు వచ్చింది. రచయిత జగదీష్ అధికారి కలం నుంచి రూపుదిద్దుకున్న నాటకం ‘మా లో చాంబర్’కి నిరంజన్ పాణిగ్రహి దర్శకత్వం వహించి సమర్థవంతులైన కళాకారులతో ప్రదర్శింప చేసి అత్యుత్తమ రెండో నాటకంగా గుర్తించారు. ఈ నాటకానికి సంగీత కళాకారులు జి.మహేష్, రామ నిగమ మహంతి సంగీతం సమకూర్చారు. ఈ నాటకంలో పాత్రదారులు సురేష్ హోత్త, పంచానన మిశ్ర, నృశింగ షొడంగి, సరోజ్ మిశ్ర, నిరంజన్ పాణిగ్రహి, పవిత్ర మల్లిక్, బిజయ లక్ష్మీ పాణిగ్రహి, నివేదిత పాణిగ్రహిలు తమ పాత్రలకు జీవం పోశారు. ఈ నాటకం బరంపురం నాటక పోటీల మంచ్‌లో ప్రదర్శించబడిన నాటకాలలో రెండో అత్యుత్తమ నాటకంగా ఎంపికై ంది. అత్యుత్తమ హాస్య నటునిగా పవిత్ర మల్లిక్, అత్యుత్తమ సహాయనటుని కళాకారునిగా నృశింగ షొడంగి ఎంపికయ్యారు. ‘మా లో చాంబర్’ నాటకం ఆంధ్రప్రదేశ్– ఒడిశా రాష్ట్రాల వివాదస్పద కొటియ ప్రాంత ప్రజల దమనీయ జీవనం, ఆ ప్రాంత ఆదివాసీ ప్రజలు, న్యాయవాదులు మధ్య సంఘర్షణలు కథా వస్తువుగా తీసుకొని రచించబడింది. ఈ నాటకం ప్రారంభం నుంచి మగిసే వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందని జయపురం సంస్కృతి సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.


