తగాదాలో గాయపడిన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

తగాదాలో గాయపడిన వ్యక్తి మృతి

Jan 12 2026 8:05 AM | Updated on Jan 12 2026 8:05 AM

తగాదా

తగాదాలో గాయపడిన వ్యక్తి మృతి

సారవకోట: గుమ్మపాడు పంచాయతీ అగదల గ్రామంలో గత ఏడాది నవంబర్‌లో భూ తగాదాలో దాడికి గురై తీవ్ర గాయాలపాలైన బమ్మిడి జయరాం(76) ఆదివారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరి పంట కోత విషయమై అదే గ్రామానికి చెందిన హనుమంతు రామకృష్ణ, బలగ నాగభూషణంలు జయరాంపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అప్పటి నుంచి శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. అప్పట్లో సారవకోట పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు.

బెదిరింపు కేసులో

ముగ్గురు అరెస్టు

పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను బెదిరింపు కేసులో కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌ షహబాజ్‌ అహ్మద్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పలాస రైల్వే స్టేషన్‌ టూవీలర్‌ పార్కింగ్‌, రైల్వే రన్నింగ్‌ రూమ్‌ మెయింటెనెన్స్‌ కాంట్రాక్టు వ్యవహారంలో శనివారం రాత్రి గొడవ జరిగిందన్నారు. 2005 డిసెంబరులో వీటిని కాంట్రాక్టు పొందిన కుర్ధా రోడ్డుకు చెందిన కణితి జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెదిరింపు, దాడి కేసులో నిందితులుగా ఉన్న ఎం.సురేష్‌, ఎం.చిన్నారావు, ఎం.మోహనరావులను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా కిషోర్‌కుమార్‌

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శిగా సంపతిరావు కిషోర్‌కుమార్‌ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో ఈయన్ను ఎన్నుకున్నారు. కిశోర్‌కుమార్‌ 24 ఏళ్లుగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ కౌన్సిల్‌ సమావేశాల్లో సంక్షేమ పథకం బోర్డు డైరెక్టర్‌గా గుంట కోదండరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బి.శ్రీరామ్మూర్తి, ఎల్‌.బాబురావు, సీహెచ్‌ రవీంద్ర, బి.తవిటమ్మ ఎన్నికయ్యారు.

బంగారం చోరీపై ఫిర్యాదు

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలోని ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన పెద్దింటి గౌరీదేవి నివాసంలో 2 తులాల బంగారం చోరీకి గురైంది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 7న విద్యుత్‌ మరమ్మతుల పనులు చేయించేందుకు కొందరు సిబ్బంది వచ్చారని, వారు సాయంత్రం వెళ్లిపోయాక మేడపై ఉన్న గదిలో బీరువా తెరిచి చూడగా తులం గొలుసు, తులం చెవి రింగులు, రూ.40 వేలు నగదు చోరీకి గురయ్యాయని బాధితురాలు తెలిపారు. ఈ మేరకు గౌరీదేవి ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

పోరాట యోధుడు ఓబన్న

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: బ్రిటీష్‌ సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొని ఉరుకులు పెట్టించిన వీరయోధుడు వడ్డే ఓబన్న అని కలెక్టరేట్‌ పర్యవేక్షక అధికారి సూర్యనారాయణ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఓబన్న 219వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేనాటి గడ్డపై జన్మించిన ఓబన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఆంగ్లేయులపై వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు. నల్లమల అడవుల్లో సంచార జాతులతో సైన్యాన్ని నడిపించి బ్రిటీష్‌ కంపెనీ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టారని గుర్తు చేశారు. ఇంతటి చరిత్ర ఉన్న వీరుడికి స్వాతంత్య్ర పోరాట చరిత్రలో తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరమన్నారు. ఆయన జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది, వడ్డెర కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బస్సు ఢీకొని వృద్ధురాలికి గాయాలు

శ్రీకాకుళం ౖక్రైమ్‌ : ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఇన్‌గేట్‌ సమీపంలో బస్సు ఢీకొన్న ఘటనలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాగోలుకు చెందిన పైలా నర్సమ్మ (72) ఆదివారం సాయంత్రం ఎచ్చెర్లలోని లింగాలపాడులోని తన మనవడి పుట్టిన రోజు వేడుకకు వెవెళ్లి తిరిగి ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరింది. రాగోలు వెళ్లేందుకు కాంప్లెక్సు ఇన్‌గేట్‌ వద్ద వేచి ఉండగా విశాఖ–అనకాపల్లి పండగ స్పెషల్‌ బస్సు వృద్ధురాలి కాలి మీద నుంచి వెళ్లడంతో గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వెంటనే రిమ్స్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తగాదాలో గాయపడిన  వ్యక్తి మృతి 1
1/1

తగాదాలో గాయపడిన వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement