అపార్ట్‌మెంట్ పూర్తయ్యేది ఎప్పుడు?
భువనేశ్వర్: ఖుర్దా రోడ్ రైల్వే మండలంలో రైల్వే ఉద్యోగుల వసతి కోసం ప్రారంభించిన క్వార్టర్ల సముదాయం (అపార్ట్‌మెంట్) నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. గత ఐదేళ్లుగా ఈ పనులు స్తంభించిపోయాయి. ఉద్యోగుల ప్రాథమిక సౌకర్యాల కోసం తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ శాఖా కార్యదర్శి లక్ష్మీ ధర్ మహంతి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఈ ప్రాంతం సందర్శించి బాగోగులు పర్యవేక్షించింది. అపార్టుమెంట్ల నిర్మాణం నిలిపి వేయడంతో సంఘ విద్రోహక శక్తుల అడ్డాగా మారి పరిసరాల్లో నివాసితులకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. మరోవైపు లక్షలాది రూపాయల వ్యయం నిర్వీర్యం కావడంతో రైల్వే ఉద్యోగులకు క్వార్టర్ సదుపాయం కొరవడుతోందని సిబ్బంది వర్గం ఆరోపించింది. ఖుర్దా రోడ్ స్టేషన్ 5వ నంబర్ ప్లాట్‌ఫామ్ దక్షిణ దిశలో మురుగు కాలువ వ్యవస్థ దెబ్బతింది. 200 మీటర్ల పొడవున మురుగునీరు ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి, రైలు పట్టాల మధ్య బురద పేరుకుపోతుంది. విధుల నిర్వహణలో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. ఆరోగ్య అధికారిని నిలదీయడంతో ప్రభావిత ప్రాంతం ప్రత్యక్షంగా పరిశీలించారు. మురుగు కాలువ లోపలి నుంచి ఇంజిన్‌లోకి ఆయిల్ పోయడానికి ఉద్దేశించిన డీజిల్ పైపు ఏర్పాటు చేయడంతో మురుగు నీరు బయటకు వెళ్లడం లేదని గుర్తించారు. కాలువ లోపలి పైపులను తొలగించడం శాశ్వత పరిష్కారంగా అధికారి పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్లు నిర్మాణం పూర్తి, డీజిల్ పైపులను వెంటనే తొలగించేందుకు రైల్వే ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేయడం జరుగుతుందని లక్ష్మీ ధర్ మహంతి తెలిపారు.
అపార్ట్‌మెంట్ పూర్తయ్యేది ఎప్పుడు?


