నైపుణ్య యువతరం ఆవిష్కరణే లక్ష్యం
● ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి
భువనేశ్వర్: రాష్ట్రంలో భారీ పారిశ్రామికీకరణ దిశలో ప్రభుత్వ కార్యాచరణ చురుకుగా ఊపందుకుంది. యువత ఏ రంగంలో నైపుణ్యం కలిగి ఉన్నా ఒడిశాలో ఉపాధిని పొందగలుగుతారు. అన్ని స్థాయిలలో నైపుణ్య యువతరం ఆవిష్కరణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. శుక్రవారం జరిగిన ఒడిశా నైపుణ్య పోటీ 2025–26 ముగింపు కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రతిభావంతులైన నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.ఈ నైపుణ్య పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి 54 బంగారు పతకాలు, 53 వెండి పతకాలు, 50 కాంస్య పతకాలను అందజేశారు. బంగారు పతకం విజేతలకు రూ. 25 వేల నగదు బహుమతి, వెండి పతకం విజేతలకు రూ. 20 వేలు, కాంస్య పతకం విజేతలకు రూ. 15 వేలు, ధృవపత్రాలు అందజేశారు.రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి మరియు ఆర్థిక పురోగతికి నైపుణ్యం చాలా అవసరం. ప్రజలను శక్తివంతం చేయ డమే ప్రధాన లక్ష్యం. యువతలో నైపుణ్యత వారి భవిష్యత్తు ప్రకాశవంతం చేస్తుందని ముఖ్యమంత్రి ప్రోత్సహించారు. 2036 నాటికి సుసంపన్న ఒడిశా మరియు 2047 నాటికి వికసిత భారత్ దార్శనికత సాకారం చేసేందుకు యువతరం నైపుణ్యత దోహ దపడుతంది. ఉజ్వల యువత ఒడిశా భవిష్యత్తుని ఉజ్వలం చేస్తుంది.
పారిశ్రామికీకరణ లక్ష్య సాధనకు మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ప్రధాన సోపానాలుగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత 18 నెలల్లో రూ. 6.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. దీంతో 3 లక్షల 64 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం నిర్విరామంగా చేస్తోంది. ఐటీఐ స్కీమ్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 47 ఐటీఐలను ఎక్సలెన్స్ కేంద్రాలుగా మార్చి మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు తాజా నైపుణ్యాల ద్వారా శిక్షణ అందించబడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. మరో వైపు
కృత్రిమ మేధస్సు రంగంలో నైపుణ్యాల సాధనకు రాష్ట్రంలోని 9 ఐటీఐలలో ఏఐ ప్రయోగశాలను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
పరిశ్రమలు మరియు నైపుణ్యాభివృద్ధి విభాగం మంత్రి సంపద్ చంద్ర స్వంయి మాట్లాడుతూ ఒడిశా నైపుణ్య పోటీ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు. నూతన ఒడిశా యొక్క సమిష్టి ఆకాంక్షలను ప్రదర్శించే వేదికగా పేర్కొన్నారు. ఈ పోటీ యువతరంలో ప్రతిభను గుర్తించి నైపుణ్యాన్ని ప్రోత్సహించింది. భారీ జాతీయ మరియు అంతర్జాతీయ అవకాశాలకు బలమైన సోపానంగా నిలిచిందన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, అభివృద్ధి కమిషనర్ దేవ్ రంజన్ కుమార్ సింగ్, పరిశ్రమలు మరియు నైపుణ్యాభివృద్ధి విభాగం కమిషనర్ భూపేంద్ర సింగ్ పుణియా ఈ కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొన్నారు.
నైపుణ్య యువతరం ఆవిష్కరణే లక్ష్యం
నైపుణ్య యువతరం ఆవిష్కరణే లక్ష్యం


