త్వరలో సీఎం కన్యా వివాహ్ యోజన
● లబ్ధిదారులకు రూ. 51 వేలు కానుక
భువనేశ్వర్: రాష్ట్రంలో త్వరలో ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన ప్రారంభం కానుంది. ఈ పథకం కింద వధువుకు పెళ్లి కానుకగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం కార్యాచరణ కోసం పెళ్లి కానుక సరంజామా సరఫరా కోసం ఉత్కలికి, మహిళా శిశు అభివృద్ధి శాఖ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద వధువులకు చీరలు, పట్టీలు, పసుపు, కుంకుమ వంటి ఉపకరణాలు లభిస్తాయి. ప్రభుత్వం ఈ వస్తువులన్నింటినీ ఉత్కలిక ద్వారా లబ్ధిదారులకు అందజేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర హస్తకళల రంగానికి పరోక్షంగా చేయూతనిస్తుంది. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద ప్రభుత్వం సమగ్రంగా రూ. 51,000 సహాయం అందిస్తుంది. వర్గాలవారీగా ఈ సహాయం విడుదల చేస్తుంది. వివాహం నమోదు చేసుకున్న ఏడు రోజుల తర్వాత రూ. 35,000 నగదు వధువు ఖాతాకు బదిలీ చేస్తారు. సారె వంటి బహుమతులు, సామగ్రి కోసం కోసం రూ.10,000, రూ. 6,000 విలువైన పెళ్లి తంతు కోసం అవరసమైన ఉపకరణాలు ప్రభుత్వం అందజేస్తుంది.


