చెట్టును ఢీకొన్న కారు
రాయగడ: జిల్లాలో గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి గుమడ సమీపంలోని బిచికోట్ వద్ద మంగళవారం ఉదయం ఒక మామిడి చెట్టుకు కారు బలంగా ఢీకొంది. బరంపురం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పడంతో పాటు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవరు కారుతో సమీపంలోని మామిడి చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో డ్రైవరు అతి చాకచక్యంతో బయటపడడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. కారు మాత్రం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సంఘటన స్థలానికి గుమడ పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జింక కొమ్ములు స్వాధీనం
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి శుంగేరు పంచాయతీ సగబారి గ్రామంలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో జింకకు చెందిన మూడు కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బందితో రేంజర్ సచితానంద పరిడ, ఫారెస్టర్ దీనబంధు సబర్‌లు మంగళవారం ఉదయం గ్రామంలో ఆకస్మిక దాడులను నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రహల్లాద్ నాయక్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు ఈ మేరకు మూడు జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో నిందితుడు ఇంట్లో లేకపోవడంతో అరెస్టు చేయలేకపోయామని అధికారులు తెలియజేశారు. అయితే అతని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
యువతిపై అత్యాచారం
రాయగడ: ఒక మతి స్థిమితం లేని యువతిపై గుర్తు తెలియని ముగ్గురు దండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలోని గుడారి సమితి నైరా ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ మేరకు బాధిత కుటుంబీకులు గుడారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మతి స్థిమితం లేని ఒక యువతి ఇంటికి వస్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఆమెను ఒక పత్తి పంట లోపలికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తామని భయపెట్టారు. అనంతరం ఆమె ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


