ఇబ్రహీంపట్నం: కొండపల్లిలోని 36, 37 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఆదివారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఓటింగ్ శాతం ఎంత అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ, పటిష్టతలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలన్నారు. ఇప్పటి వరకు తాను అనేక పోలింగ్ కేంద్రాలు పరిశీలించానని, అన్ని చోట్లు ఓటింగ్ సరళి, ఏర్పాట్లు బాగున్నాయని వెల్లడించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): అగ్రి గోల్డ్ బాధితులు, ఏజెంట్ల వద్ద ఉన్న ఒరిజినల్ బాండ్లను కానూరులోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలో పరిశీలించనున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమ, మంగళవారాల్లో వీరులపాడు మండలం, ఈనెల 6, 7 తేదీల్లో చందర్లపాడు మండలానికి సంబంధించిన వారి బాండ్లు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా రోజుల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల్లోపు అగ్రి గోల్డ్ డిపాజిటర్లు, లబ్ధిదారులు, ఏజెంట్లు తమ బాండ్ల పరిశీలనకు రావాలని సూచించారు.
అమరజీవికి ఘన నివాళి
జగ్గయ్యపేటఅర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను జగ్గయ్యపేట పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) జగ్గయ్యపేట కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ ఆధ్యాత్మిక కమిటీ వైస్ చైర్మన్ పేరూరి వెంకటలక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే నేడు తెలుగు రాష్ట్రం ఏర్పడిందన్నారు. కర్యక్రమంలో పెద్ద శివాలయం స్థానాచార్యులు పిల్లలమర్రి నాగేశ్వరశర్మ, చక్కా సూర్యప్రకాష్, పెను గొండ రామకృష్ణ, చౌట రమేష్, కంభంపాటి రవికుమార్, కర్లపాటి కొండ, రాయపూడి శ్రీనివాసరావు, చిన్నం ప్రసాద్, రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ


