అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ 73వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటలోని ఐదు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని విజయవాడ మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. న్యూఆర్‌ఆర్‌పేటలోని కేర్ అండ్ షేర్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సాయంత్రం 4:40 గంటలకు తాను సందర్శించినప్పుడు టీడీపీ, వైఎస్సార్ సీపీ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుందని, దీని వల్ల పోలింగ్‌కు ఆటంకం కలిగిందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ)కి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో డివిజన్లోని ఐదు పోలింగ్ బూత్లలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి తిరిగి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారని ఆరోపించారు. అదనపు పోలీసు బలగాలు వచ్చి ఘర్షణకు దిగిన వారిని చెదరగొట్టారన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు టీడీపీ వర్గానికి చెందిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 73వ డివిజన్లోని 73/1, 73/2, 73/3, 73/4, 73/5 మొత్తం ఐదు పోలింగ్ బూత్‌లలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అలాగే పోలింగ్‌కు ఆటంకం కలిగించిన వారందరినీ అరెస్ట్ చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి వరకు తాను అక్కడే ఉండి ఆందోళన కొనసాగిస్తానంటూ పోలింగ్ కేంద్రం ఎదుటే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పోలింగ్ కేంద్రం వద్ద స్వతంత్ర అభ్యర్థి ఆందోళన


