చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ‘పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నావురా.. నా.. కొ.. నీ అమ్మ..’ అంటూ కూటమి నేతలు ఒకరిపై మరోకరు బూతు పురాణం అందుకున్నారు. ఒకరినొకరు తోసుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్‌లో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ డివిజన్‌లో కూటమి తరఫున జనసేన నుంచి అత్తులూరి కల్యాణి కార్పొరేటర్ అభ్యర్థ్థిగా పోటీలో నిలిచారు. అయితే జనసేన సీటును స్థానికంగా ఉండే కూర్మారావు ఆశించారు. మాజీ కార్పొరేటర్ భర్త అయిన పెద్దబాబు డివిజన్‌లోని ఈద్గామహాల్ రోడ్డులోని పోలింగ్ కేంద్రం దగ్గర ఉండగా, అక్కడికి దగ్గరలోనే ఇండిపెండెంట్ అభ్యర్థి పేరాబత్తుల రాజేశ్వరి కార్యాలయం వద్ద కూర్మారావు ఉన్నట్లు అతనికి తెలిసింది. అక్కడకు చేరుకున్న పెదబాబు, కూర్మారావు మధ్య వాదన మొదలైంది. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్త దుక్కా దుర్గారావు, కూర్మారావు ఒకరిని మరోకరు నోటికి వచ్చినట్లు దూషించుకున్నారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నావని కూర్మారావును దుర్గారావు విమర్శించగా, ‘నిన్నటి వరకు మీరు ఏ పార్టీలో ఉన్నారు? అన్ని పార్టీల జెండాలు మోసి ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. మేము జనసేనలో తొలి నాటి నుంచి ఉన్నాం’ అంటూ బదులిచ్చారు. వారి తీరును చూసి ఓటర్లు విస్తుపోయారు.


