వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
పటమట(విజయవాడతూర్పు): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెర లేపిందని, ఓడిపోతామనే భయం వారిని వెంటాడి తప్పుడు దారుల్లో ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ పటమట హైస్కూల్ పోలింగ్ స్టేషన్లో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన మహిళను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించి పోలీసులకు అప్పగించటంపై అక్కడిని చేరుకున్న ఆయన ఎన్నికల నిర్వహణ విధానంపై మండిపడ్డారు.
దొంగ ఓట్లు వేసే ప్రయత్నం..
కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే భయంతో దొంగ ఓట్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసుల బలం, అధికా రుల సహకారంతో పటమట హైస్కూల్, ఎన్.ఎస్.ఎం, లయోలా–సిద్ధార్థ కళాశాల వంటి పోలింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు ఈ అక్రమాలను అడ్డుకుని, సంబంధిత వ్యక్తులను పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకుండా, పట్టుబడిన వారిని వదిలిపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ ఘటనలన్నింటినీ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టికి తీసుకెళ్తామని, కూటమి ప్రభుత్వం రౌడీయిజం, గూండాయిజంతో ఎన్నికల్లో గెలవా లని చూస్తోందని విమర్శించారు.


