గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బధిరులకు రూ. 50 వేలు విలువ చేసే వినికిడి యంత్రాలు, టచ్ ఫోన్లను జేసీ ఎస్. ఇలక్కియ అందజేశారు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బధిరుల దినోత్సవం, సంజ్ఞల భాషా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి కార్యక్రమాన్ని శనివారం విజయవాడలోని ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బధిరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బధిరులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఎటువంటి సంకోచం చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వాడ్రేవు కామరాజు, జిల్లా అధికారులు, సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాలల సిబ్బంది, బధిరుల సంఘాల ప్రతినిధులు, ఇన్సైట్ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


