ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల్లో భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. దుర్గగుడిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. ఆలయ ఈఓ శీనానాయక్, పోలీసు అధికారులు, ఆలయ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు కొండపైకి చేరుకునే క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంలో దర్శన ఏర్పాట్లు, నూతన పూజా మండపం, మహా మండపం నుంచి కొండ దిగువకు చేరుకునే మార్గాలను పరిశీలించారు. ఉత్సవాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఆలయ పరిసరాలను 24 గంటలూ సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని, ఏఐతో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా చేస్తామని వివరించారుర. వెస్ట్ ఏసీపీ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ గుణరామ్, దుర్గగుడి ఈఈ ఎల్. రమాదేవి, ఆలయ వైదిక కమిటీ సభ్యుడు వి.శ్రీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.


