బీసెంట్ రోడ్డు, వన్‌టౌన్‌లో నడవాలన్నా నరకమే
రోడ్లకు రెండువైపులా అడ్డదిడ్డంగా షాపులు
వాహనాలు పార్కింగ్ చేసేందుకు కనిపించని చోటు
ముందుకు సాగని ఏటీపీఎస్ ప్రాజెక్టు పనులు
విజయవాడను పట్టి పీడిస్తున్న సమస్య
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగర ప్రజలను ట్రాఫిక్ సమస్య పట్టిపీడిస్తోంది. ఏ రోడ్డులో చూసిన బారులు తీరిన వాహనాలే దర్శనమిస్తున్నాయి. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించి గమ్యస్థానాలకు చేరుకునేందుకు వాహనచోదకులు సతమతం అవుతున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో ఆక్రమణలు పెరిగిపోవడం, దుకాణాలు రోడ్లపైకి చొచ్చుకురావడంతో సమస్య మరింత జటిలమైంది. ప్రధానంగా రద్దీ ప్రాంతాలైన వన్‌టౌన్ వీధులు, బీసెంట్ రోడ్డు, గాంధీ రోడ్డులో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఈ ప్రాంతాల్లో కనీసం నడిచేందుకు కూడా వీలు లేనంతగా రోడ్లు ఆక్రమణలకు గురయ్యాయి. దీనికితోడు ఆటో డ్రైవర్లు తమ వాహనాలను ఇష్టారాజ్యంగా రోడ్లపై అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. ఫలితంగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిమిషాల్లో చేరాల్సిన దూరాలకు సైతం గంటల సమయం పడుతోంది. ప్రధాన కూడళ్లలో సిగ్నల్ పడిన సమయాల్లో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కే మార్గాలు కనిపించడం లేదని నగరవాసులు వాపోతున్నారు.
పార్కింగ్ ప్రాంతాలేవీ..
టాక్టికల్ ఆర్సినిజంలో భాగంగా రోడ్లకు రెండు వైపులా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వివిధ షాపుల యజమానులు రోడ్లపై ఉంచిన వస్తువులను పోలీసులు తొలగిస్తున్నారు. ఆయా షాపుల యజమానులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిరు వ్యాపారులకు సంబంధించిన షాపులను తొలగిస్తున్నా మార్పు మాత్రం రావటం లేదు. బందరు రోడ్డు, పీవీపీ మాల్ రోడ్డు వంటి ప్రాంతాల్లో ఉన్న ప్రధాన వర్తక సంస్థలకు పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో ఆయా సంస్థలకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపైనే ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు. వీటి వల్లా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదు. స్కూళ్లు, కాలేజీలను వదిలే సమయంలో ఆయా విద్యా సంస్థల బస్సులను రోడ్లపైనే నిలపడం, విద్యార్థులు భారీగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎన్టీఆర్ సర్కిల్‌లో ప్రైవేటు ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సులను అడ్డదిడ్డంగా నిలపడం కూడా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతోంది.
పట్టించుకోని ప్రభుత్వం
నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా భావిస్తున్న ఏటీసీఎస్ (అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్) సంబంధించిన పనులు 2023లో ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ పనులను పట్టించుకోవటం లేదు. అప్పట్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు రూ.5 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 17 కూడళ్లలో సిగ్నళ్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. సిగ్నల్ స్తంభాలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ బోర్డులు, వాయు కాలుష్యాన్ని గుర్తించే సెన్సార్లను అమర్చాల్సిన పనులు పూర్తి కాలేదు. నగరంలో 52 కూడళ్లలో సిగ్నళ్లు ఏర్పాటు చేశాక, వాటిని అనుసంధానించాలి. ప్రధానంగా కూడళ్లలో వాహనాల లెక్కింపు కోసం సీసీ కెమెరాలు బిగించి, వాటి నుంచి ఇచ్చే ఇన్‌పుట్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు రూ.5 కోట్ల ఖర్చవుతుందని పోలీసులు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు ప్రతిపాదించినా ఫలితం లేకుండా పోయింది.
నగరంలో మూడు జోన్‌లు..
నగరంలో వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా రెడ్, గ్రీన్, అంబర్ జోన్‌లను గుర్తించారు. ఇప్పటికే స్ట్రీట్ వెండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వీధి వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. నగరంలో 1200 వీధుల్లో వ్యాపారం సాగుతున్నట్లు సర్వేలో గుర్తించారు. వీరిలో పలువురికి లైసన్సుతో పాటు గుర్తింపు కార్డులు కూడా లేవు. బీసెంట్ రోడ్డులో 257 మంది వీధి వ్యాపారం చేస్తుండగా, లైసెన్స్ కలిగిన వారు 57 మంది మాత్రమే. మిగిలిన వారంతా అనధికారికంగా వ్యాపారం సాగిస్తున్నారు. కార్పొరేషన్ లైసెన్స్ పొందిన వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి కట్టడి చేస్తే, కొంత మేర ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి.


