నాగాయలంక: విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, చౌర్యానికి పాల్పడిన వారిపై చట్టపరమైన తీసుకుంటామని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ రవీంద్రబాబు హెచ్చరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వాసు, ఉయ్యూరు ఆపరేషన్స్ ఇంజినీర్ సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు 50బృందాలుగా ఏర్పడి మండలంలోని గ్రామాల్లో సోమవారం విస్త్రృత తనిఖీలు నిర్వహించారు. అనంతరం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం రాత్రి ఈ బృందాలతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ 3,816 గృహ, వాణిజ్య, ఆక్వా, ఇతర సర్వీసులను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. వీటిలో 437సర్వీసులకు సంబంధించి 581కేడబ్ల్యూ అదనపులోడు కింద రూ.11,38,000 అపరాధ రుసుము విధించినట్లు వివరించారు.
సమాచారం ఇవ్వండి..
విద్యుత్ మీటర్లకు తప్పనిసరిగా సీల్ ఉండాలని లేనిచో సంబంధిత అధికారికి తక్షణం సమాచారం ఇవ్వాలని రవీంద్రబాబు సూచించారు. తమ తనిఖీలలో సీలు లేకపోవడం, గాట్లు పడటం, మీటర్లు మార్చడం వంటి చర్యలు గుర్తిస్తే వాటిని విద్యుత్ చౌర్యంగా పరిగణించి విద్యుత్ చట్టం135కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మొదటి తప్పునకు కాంపౌండింగ్ పద్ధతిలో మినహాయింపు ఇచ్చినప్పటికీ, రెండోసారి అదే తప్పు చేస్తే అరెస్ట్ చేయించి రిమాండ్‌కు పంపిస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం గుర్తిస్తే 94408 12091, 94408 12362, 94408 12363 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యుత్ విజిలెన్స్ తనిఖీలలో అవనిగడ్డ డీఈఈ ఎన్.సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాగాయలంక ఏఈ జి.వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ ఎస్‌ఈ రవీంద్రబాబు


