భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయ వాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలోని టిడ్కో గృహాల సముదాయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ శుక్రవారం పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న కార్మికుల సంఖ్య నిర్మాణ పనుల పురోగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. అనంతరం వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) ప్రాంతాన్ని కూడా సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి జక్కంపూడి గృహ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. జక్కంపూడిలో మొత్తం 6,576 గృహాల నిర్మాణం చేపట్టగా 2026 మార్చి నెలలో 2,256 గృహాలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన 4,320 గృహాల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్‌ఫ్రా, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, గొల్లపూడి వద్ద నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్ పనుల పురోగతిని కూడా కలెక్టర్ లక్ష్మీశ సమీక్షించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ సిబ్బంది, ఏజెన్సీల సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ


