పీవీపీ మాల్‌లో కమాండో ఆపరేషన్‌! | - | Sakshi
Sakshi News home page

పీవీపీ మాల్‌లో కమాండో ఆపరేషన్‌!

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

ఆకట్టుకున్న ఆక్టోపస్‌ మాక్‌ డ్రిల్‌

గుణదల(విజయవాడ తూర్పు): మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పీవీపీ మాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఆక్టోపస్‌ టీమ్‌ మాక్‌డ్రిల్‌ నిర్వహించింది. ఉగ్రవాదులు చుట్టుముట్టిన సమయంలో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ప్రదర్శన ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా ఆక్టోపస్‌ ఎస్పీ ఎం. ఉదయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ అవాంఛనీయ ఘటనలు, ఉగ్రదాడుల సమయంలో ప్రజలను రక్షించడంలో కమాండోలదే కీలక పాత్ర అని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రజలకు రక్షణ కల్పించేందుకు కమాండోలు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయా ల్లో ఆక్టోపస్‌ టీమ్‌ చాకచక్యంగా వ్యవహరించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందన్నారు. వైద్యుల సహాయంతో క్షతగాత్రులకు సేవలందిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఆక్టోపస్‌ అడిషనల్‌ ఎస్పీ కె. రామచంద్రమూర్తి, డీఎస్పీలు జగ్గునాయుడు, బి. కృష్ణ, తిరుపతయ్య, మాచవరం పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement