జలవనరులను పరిరక్షించాలి
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): జల వనరుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కాలువలు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులపై ఆక్రమణలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అధికారులు నిర్వహించే క్షేత్రస్థాయి తనిఖీలు, పరిశీలనల నివేదికలు సమగ్ర కార్యాచరణకు కీలకమని అన్నారు. జల వనరుల సంరక్షణ, ఆక్రమణల గుర్తింపు, తొలగింపునకు సంబంధించి కలెక్టర్ లక్ష్మీశ.. శుక్రవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎంతో కలిసి పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, జల వనరులు తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులతో కలిసి వర్చువల్‌గా హాజరయ్యారు. సమావేశంలో జల వనరుల సంరక్షణకు సంబంధించి ఏపీ హైకోర్టులో 2024లో దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై చర్చించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాలువలు, డ్రైన్లు, చెరువులు తదితర జలవనరుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీ కేజీవీ సరిత, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, డీపీవో పి.లావణ్యకుమారి, ఇరిగేషన్ స్పెషల్ డివిజన్ ఈఈ బి.ఆంజనేయప్రసాద్, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దేవదాయ అధికారి శాంతి బెయిల్ డిస్మిస్ విజయవాడలీగల్: అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి తరఫున రెండవసారి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. శాంతి తరఫున న్యాయవాది గోలి నరసింహారావు వాదనలు వినిపిస్తూ, శాంతిని పోలీసులు రెండు సార్లు కస్టడీకి తీసుకుని విచారించినా ఏవిధమైన సమాచారం సేకరించలేకపోయారన్నారు. ఆమె కేసుకు సంబంధించి పోలీసులకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆమెకు మూడేళ్లలోపు వయసు బాబు ఉన్నందున అతని బాగోగులు చూడాల్సిన బాధ్యత తల్లిగా ఆమెకు ఉన్నందున బెయిల్ మంజూరుచేయాలని న్యాయమూర్తికి తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, శాంతి పోలీసుల కస్టడీలో పూర్తిగా సహకరించలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే, సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశముందని, బెయిల్‌ను తిరస్కరించాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్‌ను డిస్మిస్ చేశారు.
సోనోవిజన్‌లో ఎల్‌జీ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్లు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మార్కెట్‌లోకి సరికొత్త ఎల్‌జీ ఫ్రెంచ్ డోర్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ విడుదలైంది. శుక్రవారం ఏలూరు రోడ్డులోని ‘విజయవాడ విజయ టాకీస్ సెంటర్ సోనోవిజన్‌లో మేనేజింగ్ డైరెక్టర్ పి.భాస్కరమూర్తి, ఏపీ రీజనల్ బిజినెస్ హెడ్ కె.వి.కృష్ణాజీ, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పి.కిషోర్ బాబు తదితరుల చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించారు. ఇది ఆటో ఐస్ మేకర్‌తో వచ్చిన భారతదేశపు మొట్టమొదటి ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ అని భాస్కరమూర్తి చెప్పారు. 610 లీటర్ల వరకు వివిధ సామర్థ్యాలతో లభించే ఈ శ్రేణిలో ఇన్‌స్టా వ్యూ డోర్ ఎన్ డోర్, వాటర్ డిస్పెన్సర్, ఫ్రెష్ కన్వర్టర్, డోర్ కూలింగ్, హైజీన్ ఫ్రెష్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఫ్రెంచ్ డోర్ శ్రేణి ధరలు రూ.1.18 లక్షల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. దీంతో పాటు 674, 790 లీటర్ల సామర్థ్యం గల అతి పెద్ద డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లను కూడా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లాంచ్ చేసినట్లు భాస్కరమూర్తి వివరించారు.