అనగనగా.. | - | Sakshi
Sakshi News home page

అనగనగా..

May 15 2026 12:19 PM | Updated on May 15 2026 12:19 PM

అనగనగా.. ● పెరిగిన ధరలకు తోడు బంగారం దిగుమతిపై పది శాతం సుంకం విధింపుతో బెంబేలు ● ఉమ్మడి జిల్లాలో నగల తయారీపై ఆధారపడిన కుటుంబాలు 50 వేలకు పైనే.. ● ఇప్పటికే నగల తయారీ ఆర్డర్లు తగ్గి ఉపాధి కోల్పోతున్న స్వర్ణకార కార్మికులు ● బంగారంపై ప్రధాని వ్యాఖ్యలతో ఆందోళన చెందుతున్న స్వర్ణకార వృత్తిదారులు

పనులు పూర్తిగా దిగజారాయి

పనులు లేక అల్లాడుతున్నాం

● పెరిగిన ధరలకు తోడు బంగారం దిగుమతిపై పది శాతం సుంకం విధింపుతో బెంబేలు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ‘బంగారం కొనవద్దంటే ఎలా? మా ఉపాధి మాటేమిటి? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు?’ అంటూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని స్వర్ణకారులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీ స్వయంగా బంగారు నగలు కొన వద్దని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నగల తయారీ వృత్తి కనుమరుగు అవ్వాల్సిందేనా అని వాపోతున్నారు. బంగారం ధర చుక్కలనంటడంతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరి ణామాల నేపథ్యంలో మారిన దేశీయ పరిస్థితులు స్వర్ణకారుల పరిస్థితిని పూర్తిగా దిగజార్చాయి. కేవలం స్వర్ణకారులే కాకుండా బంగారు నగల వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలన్నింటిని తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేలాదిగా ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు, నగల వ్యాపారులు తమ భవిష్యత్‌ ఏమిటి అన్న భయంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారు.

పెరిగిన ధర.. ఆపై పన్నుపోటు

ములిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. స్వర్ణకార వృత్తిదారుల పరిస్థితి. ఇరాన్‌, అమెరికా యుద్ధ్యం నేపథ్యంలో బంగారం ధర చుక్కలనంటుతోంది. ఇది ఉమ్మడి జిల్లాలో బంగారం విక్రయాలు, నగల తయారీపై తీవ్ర ప్రభావం చూపించింది. ధర పెరిగి, నగలు తయారు చేయించేవారు తగ్గి వృత్తిదారులు అల్లాడుతున్న నేపథ్యంలో ఏడాది పాటు ప్రజలంతా బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు ఇచ్చారు. అంతేకాకుండా బంగారం దిగుమతి సుంకాన్ని పదిశాతం పెంచారు. దీంతో బంగార ధర మరింత పెరిగింది. దీంతో స్వర్ణకార వృత్తిదారుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.

ఉపాధిపై

భయాందోళనలు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 50 వేల మంది స్వర్ణకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరు కాకుండా బంగారు నగల వ్యాపారం చేసేవారు సైతం వేల మంది ఉన్నారు. విజయవాడతో పాటుగా మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు తది తర ప్రాంతాల్లో స్వర్ణకార వృత్తిదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక్క విజయవాడలోనే 30 వేల నుంచి 35 వేలకు పైగా కుటుంబాలు బంగారు నగల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి. విజయవాడ పాతబస్తీలోనే 25 వేల మంది జీవిస్తున్నారని ఆయా సంఘాల నేతలు చెబుతున్నారు. వీరిలో కేవలం పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వృత్తిదారులు ఆరేడు వేల మంది ఉన్నారని అంచనా. నగరంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు సైతం స్వర్ణాభరణాల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. బంగారు ఆభరణాల రంగం కార్పొరేట్‌ సంస్థల చేతిలోకి వెళ్లిన నేపథ్యంలో స్వర్ణకార వృత్తిదారులు చాలా మంది పనులు లేక అల్లాడుతున్నారు. ఉపాధి కోసం ఇతర రంగాలను ఆశ్రయిస్తున్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో వృత్తిదారుల కుటుంబాలన్నీ ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి.

బంగారు ఆభరణాల తయారీ పనులు పూర్తిగా దిగజారిపోయాయి. గతంలో ఆభరణాల తయారీ అంటే స్వర్ణకార వృత్తి దారుల వద్దకే ప్రజలు వచ్చేవారు. కార్పొరేట్‌ సంస్థల ప్రచారంతో మా వద్దకు వచ్చే వారి సంఖ్య పడిపోయింది. ఇప్పుడేమో ఏకంగా ప్రధాని బంగారం కొనవద్దని చెప్పి, పన్నులు పెంచితే మా వృత్తిదారుల పరిస్థితి ఏమిటి? మా కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలి.

– చిట్టూరి రాజేష్‌,

స్వర్ణకార వృత్తిదారుడు, విజయవాడ

బంగారు నగల విక్రయాలను కేంద్ర ప్రభుత్వమే నీరు గారుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకార వృత్తిదారులను ఆదు

కోవాలి. కొనేవాళ్లు లేక నగల వ్యాపారులు, పనులు లేక వృత్తిదారులం అల్లాడిపోతున్నాం. ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా నగలు కొనవద్దంటే మా లాంటి వారు ఏమి కావాలి? స్వర్ణకార వృత్తిదారులను ఆదుకునేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి.

– అవ్వారు జోజిబాబు,

స్వర్ణకార వృత్తిదారుడు, విజయవాడ

Advertisement
 
Advertisement
Advertisement