ఎరువుల ధరలు తగ్గించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఎరువుల ధరలు తగ్గించాలని ధర్నా

May 15 2026 12:19 PM | Updated on May 15 2026 12:19 PM

ఆటోనగర్‌(విజయవాడతూర్పు): పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఎం, ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం కృష్ణంలకలోని ఫ్యాక్ట్‌ ఎరువుల రాష్ట్ర కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కృష్ణయ్య, పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఫలితంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్లుగా యూరియా, డీఏపీ ఎరువులు అందక పంటలు సాగు చేయలేకపోయారని పేర్కొన్నారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో పెట్టిన ఎరువుల బిల్లును ఉపసంహరించుకోవాలని సూచించారు. బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఎరువుల సబ్సిడీలను భరించాలన్నారు. రైతులు, కౌలు రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించాలన్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల బస్తా ధరను రూ.150 నుంచి రూ.300 వరకు కేంద్రం పెంచి రైతులపై వందల కోట్ల రూపాయల భారం మోపిందని దుయ్యబట్టారు.

ఉచిత సలహాలతో సరి

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్పత్తి ఖర్చులు తగ్గించాలని ఉచిత సలహాలు ఇవ్వడం మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదని కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల ధరలపై నోరు మెదపడంలేదని మండిపడ్డారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యుడి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వీడి ఎరువు ధరలను తగ్గించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తొలుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు కౌలు సంఘం కార్యదర్శి ఎం.హరిబాబు, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.బలరాం, వై.కేశవరావు, వై.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పాత ధరలకే ఎరువులను అందించాలి

సకాలంలో అవసరమైన ఎరువులు అందకపో వడం వల్ల రెండేళ్లు తీవ్రంగా నష్టపోయామని ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొన్ని రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుందని, అయితే అవసరమైన ఎరువులు అందుబాటులో లేవని ఆందో ళన వ్యక్తంచేశారు. పాత ధరలకే ఎరువులు అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ఆయా పంటలకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement