ఇన్‌టేక్‌వెల్ నిర్మాణానికి సన్నాహాలు జక్కంపూడి టిడ్కో ఇళ్లకు నీటి సరఫరా కోసం..
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రజా ప్రయోజనార్థం కృష్ణానదీ తీరాన ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలో వైఎస్సార్ ఘాట్‌ను నిర్మించారు. అయితే దీనిని ఇన్‌టేక్ వెల్ నిర్మాణం పేరుతో ధ్వంసం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2022లో రూ.26 లక్షలతో పంచాయతీ, మండల నిధులతో పంచాయతీ రాజ్ శాఖ వైఎస్సార్ ఘాట్‌ను నిర్మించింది. అప్పటి నుంచి అహ్లాదకర వాతావరణంలో ఈ ఘాట్ ప్రజలతో కళకళలాడుతోంది. ప్రస్తుతం ఇన్‌టేక్ వెల్ కోసం ర్యాంప్ ఏర్పాటుకు భారీ ఎత్తున ఇసుక డంప్ చేయడంతో ఘాట్ కళావిహీనంగా మారింది. ఇన్‌టేక్ వెల్ కోసం లోతుగా గోతులు తీయాల్సి ఉంటుంది. వెల్ చుట్టూ సుడులు మాదిరిగా ఖాళీ వలయం ఏర్పడుతుంది. ఇన్‌టేక్ వెల్ నిర్మాణం పూర్తయిన తరువాత నదీ స్నానానికి, ఈత కొట్టేందుకు వచ్చేవారు ఇన్‌టేక్‌వెల్ కోసం తీసిన గోతుల కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల సాకుగా ఘాట్‌ను మూసివేసే ప్రమాదం ఉందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. జక్కంపూడిలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు తాగు నీటి సరఫరా నిమిత్తం వైఎస్సార్ ఘాట్‌లో ఇన్‌టేక్ వెల్ నిర్మించాలన్న కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పనులు చేపట్టామని టిడ్కో ఇంజినీరింగ్ అధికారి తెలిపారు. ఘాట్‌లో పనులు మొదలుపెట్టి వారం రోజులు అవుతుండగా, రెండు రోజుల క్రితమే తనకు సమాచారం ఇచ్చారని గొల్లపూడి ఈఓ చింతలమ్మ తెలిపారు. మొత్తం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చూసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై వీఆర్‌ఓ పవన్‌ను వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాలను పాటించడమే తమ విధి అని స్పష్టం చేశారు.


