పరిశ్రమల శాఖాధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నం(చిలకలపూడి): కృష్ణా జిల్లాలో అనుమతులు పొందిన పరిశ్రమలను వెంటనే నెలకొల్పేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలని, లేనిపక్షంలో వాటిని రద్దు చేస్తామని కలెక్టర్ డి.కె.బాలాజీ హెచ్చరించారు. తన చాంబర్‌లో పరిశ్రమల స్థాపనపై సంబంధిత అధికారులతో గురువారం ఉదయం సమావేశం నిర్వహించారు. పలువురు లబ్ధిదారులతో కలెక్టర్ స్వయంగా ఫోన్లో మాట్లాడి పరిశ్రమలను ఎందుకు ప్రారంభించడం లేదన్న వివరాలు తెలుసుకున్నారు. వెంటనే నిర్మాణం మొదలు పెట్టాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మల్లవల్లి, వీరపునేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల స్థాపనకు 370 అనుమతులు ఇచ్చామన్నారు. అనుమతులిచ్చి ఏదాదిన్నర దాటినా నిర్మాణం చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లో పనులు చేపట్టకపోతే మంజూరు చేసిన స్థలంతో పాటు అన్ని రకాల అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కొంతమంది భవన నిర్మాణం ఆమోదం కోసం దరఖాస్తు చేయకపోవడం విచారకరమన్నారు. అనుమతులు మంజూరై ఇప్పటి వరకు పనులు ప్రారంభించని లబ్ధిదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరి శ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకటరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, ప్రత్యేక అధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి ఎస్.వెంకటరావు, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, డీటీడబ్ల్యూఓ ఫణి దూర్జటి, మార్క్‌ఫెడ్ డీఎం మురళీ కిషోర్, డీసీఓ చంద్రశేఖర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి నరేష్, జిల్లా ఉపాధి కల్పనాధికారి బ్రహ్మం, డీఎల్‌డీఓ సునీతశర్మ తదితరులు పాల్గొన్నారు.


