చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఆర్టీసీ బస్సు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఘటనపై బాలుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివి.. కొత్తపేట కుమ్మరి వీధికి చెందిన మజ్జి ఇంద్రకుమార్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇంద్రకుమార్ మెడికల్ షాపులో పని చేస్తుంటాడు. ఇంద్రకుమార్‌కు ఇద్దరు కుమారులు కాగా రెండో కుమారుడు అంకిత్ గిరిధర్(12) ఏడో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో గురువారం మధ్యాహ్నం గిరిధర్ తన అన్నతో కలిసి తండ్రి వద్దకు వెళ్లి భోజనం ఇచ్చాడు. అదే సమయంలో తల్లి అక్కడికి రావడంతో పెద్ద కుమారుడు తల్లితో కలిసి మోపెడ్‌పై ఇంటికి వచ్చేశారు. ఇక గిరిధర్ సైకిల్ తీసుకుని గణపతిరావు రోడ్డుపైకి వచ్చాడు.
బస్సు చక్రాల కింద నలిగి..
గణపతిరావు రోడ్డులో కృష్ణవేణి కాంప్లెక్స్ బస్టాప్ వద్ద రోడ్డు మలుపు తిరుగుతుండగా, పంజా సెంటర్ వైపు నుంచి నెహ్రూబొమ్మ సెంటర్ వైపు వెళ్తున్న ఇబ్రహీంపట్నంకు చెందిన సర్వీసు నంబర్ 3ఏ బస్సు బాలుడిని గమనించలేదు. ఇంతలో బస్సు గిరిధర్‌ను ఢీ కొట్టగా రోడ్డుపై పడ్డాడు. బస్సు చక్రాల కింద బాలుడు నలిగిపోవడంతో తీవ్ర గాయాలై చాతి నుంచి భుజం వరకు, ముక్కు, మూతి నుంచి రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. ఇంతలో బస్సులో ఉన్న వారు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలంలో గుమిగూడి వెంటనే బాలుడిని షేక్ రాజా హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. అప్పటి వరకు తన కళ్ల ముందు కనిపించిన చిన్న కుమారుడు కొన్ని నిమిషాల లోపే విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణాతీతం. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


