నీరుగారిన లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

నీరుగారిన లక్ష్యం!

May 15 2026 10:50 AM | Updated on May 15 2026 10:50 AM

నీరుగారిన లక్ష్యం! పునర్‌ నిర్మాణానికి రైతుల ఎదురుచూపులు పూర్తిగా ధ్వంసమై.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కష్టాలు..

ప్రశ్నార్థకంగా 1700ఎకరాల సాగు..

చెక్‌డ్యామ్‌ను

వెంటనే నిర్మించాలి..

వందల ఎకరాలు బీడుగా మారుతుంది..

త్వరలో అంచనాలు తయారు చేసి పంపుతాం

చెక్‌ఢాం..
పునర్‌ నిర్మాణానికి రైతుల ఎదురుచూపులు

జి.కొండూరు: ఇరవై నెలలు గడిచినా బుడమేరు వరదల కష్టాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. వరదల గాయాలకు మందు వేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం కావడంతో బాధిత ప్రజలు నరకయాతన పడుతున్నారు. నాటి వరదలకు చిన్ననందిగామ వద్ద కోతులవాగులో చెక్‌డ్యామ్‌ పూర్తిగా ధ్వంసమైపోయి చెరువులకు సాగునీరందక రైతులు లబోదిబో మంటున్నారు. ఇరవై నెలలు గడిచినా చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం పట్ల రైతులను నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కోతుల వాగులో వరద పోటెత్తిన సమయంలో వరదనీరు చిన్ననందిగామ గ్రామంలోని పెద్ద చెరువుకు చేరేలా 1964లో వాగుకి అడ్డంగా చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. ఈ చెక్‌డ్యామ్‌ నుంచి పెద్ద చెరువు వరకు 1600మీటర్లు మేర సప్లయ్‌ చానల్‌ను సైతం తవ్వారు. ఈ విధంగా కోతుల వాగు నుంచి నీరు పెద్ద చెరువుకు చేరి చెరువు నిండిన తర్వాత కళింగ పొర్లి పక్కనే ఉన్న మర్ల చెరువుకు నీరు చేరుతుంది. అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ చెక్‌డ్యామ్‌ శిథిలావస్థకు చేరడంతో 2017కు ముందే నూతన చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగి నిలిచిపోయాయి. ఈ క్రమంలో 2024, ఆగస్టు నెలలో బుడమేరుకు వరద పోటెత్తిన సమయంలో కోతులవాగు కూడా ఉగ్రరూపం దాల్చడంతో ఈ చెక్‌డ్యామ్‌ పూర్తిగా ధ్వంసమైపోయింది. అప్పటి నుంచి రైతులే తాత్కాలికంగా అడ్డుకట్టు ఏర్పాటు చేసుకొని చెరువును నింపుకొంటున్నారు.

ఈ చెక్‌డ్యామ్‌ను పునర్‌నిర్మాణం చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో గత ఇరవై నెలలుగా చిన్ననందిగామ రైతులు నరకయాతన పడుతున్నారు. ఈ చెక్‌డ్యామ్‌ శిథిలావస్థకు చేరిందని పునర్‌ నిర్మాణం కోసం 2017లో రూ.3.75కోట్లకు టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టరు పలు కారణాలతో నిర్మాణ పనులను ప్రారంభించలేదు. ఆ తర్వాత ఈ చెక్‌డ్యామ్‌ ద్వారానే సాగునీరు సరఫరా అయ్యింది. అయితే 2024, ఆగస్టులో వచ్చిన వరదలకు పూర్తిగా కొట్టుకుపోయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ చెక్‌డ్యామ్‌ ఉన్న ప్రదేశంలో భారీ వరదకు కోతకు గురై వాగు వెడల్పు 80మీటర్ల వరకు పెరిగింది. దీనితో ప్రస్తుతం ఈ చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి రూ.6కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

చిన్ననందిగామ వద్ద కోతులవాగులో

పూర్తిగా ధ్వంసమైన చెక్‌ డ్యామ్‌

ప్రశ్నార్థకంగా మారిన చిన్ననందిగామ

పెద్ద చెరువు, మర్ల చెరువు ఆయకట్టు

చెక్‌డ్యామ్‌ నిర్మాణంపై సర్కారు

మీనమేషాలు

నిర్లక్ష్యం వీడకపోతే 1700 ఎకరాల

సాగు భూమి బీడే

చిన్న నందిగామ పెద్ద చెరువు లోతట్టు విస్తీర్ణం 166.22ఎకరాలు కాగా ఈ చెరువు కింద 388.02ఎకరాలు ఆయకట్టుగా సాగు భూమి ఉంది. అదేవిధంగా మర్ల చెరువు లోతట్టు విస్తీర్ణం 71.04ఎకరాలు కాగా 130.77ఎకరాలు ఆయకట్టు సాగు భూమి ఉంది. ఇదే కాకుండా ఈ రెండు చెరువుల పరిధిలో మరో 1200ఎకరాల వరకు సాగు భూమి ఉంది. కాగా ఈ రెండు చెరువులకు నీటిని అందించే చెక్‌డ్యామ్‌ పూర్తిగా ధ్వంసమై పోవడంతో సాగుపై ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులే ఇసుక బస్తాలతో తాత్కాలికంగా అడ్డుకట్ట ఏర్పాటు చేసుకున్నప్పటికీ వరద ఉద్ధృతికి తెగిపోవడం, మరలా కట్ట ఏర్పాటు చేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి చెక్‌డ్యామ్‌ నిర్మాణం చేయకపోతే క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరదలొచ్చిపోయి రెండేళ్లు కావస్తున్నా చెక్‌డ్యామ్‌ నిర్మాణం చేయకపోవడం దారుణం. ఈ చెక్‌డ్యామ్‌ నిర్మాణం చేపట్టకపోతే గ్రామంలో 1700ఎకరాల సాగు భూమి అంతా బీడుగా మారుతుంది. గ్రామంలో రైతులతో పాటు వ్యవసాయంపై ఆధారపడిన కూలీలు కూడా పనుల్లేక ఇబ్బంది పడతారు.

– పెండెం రాజేంద్రప్రసాద్‌,

గ్రామస్తుడు, చిన్ననందిగామ గ్రామం

చిన్ననందిగామ వద్ద కోతుల వాగులో చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి రైతుల నుంచి వినతులు వచ్చాయి. త్వరలో ధ్వంసమైన చెక్‌డ్యామ్‌ను పరిశీలిస్తాం. వాగు వెడ ల్పు ఎక్కువగా ఉండడం వల్ల నిర్మాణ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అంచనాలను తయా రు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతాం.

– టి.రాజేష్‌,

ఇరిగేషన్‌ ఏఈఈ, జి.కొండూరు

కోతులవాగులో చెక్‌డ్యామ్‌ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి. లేదంటే వాగులో నీరంతా దిగువకు పోవడమే తప్ప పెద్ద చెరువు, మర్ల చెరువుకు చుక్కనీరు రాదు. ఈ రెండు చెరువుల్లో నీరు లేకపోతే ఆయకట్టు భూమి సాగు చేయడం కూడా కష్టమే. వందల ఎకరాలు బీడు భూమిగా మారుతుంది.

–మైలవరపు నాగేంద్రప్రసాద్‌, రైతు, చిన్ననందిగామ గ్రామం

Advertisement
 
Advertisement
Advertisement