● బండి సంజయ్ తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి ● ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర సమితి డిమాండ్ చేసింది. హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఓర్సు భారతి, పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ బండి సంజయ్ తనయుడు భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి, వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనంగా మారిందన్నారు. నిందితుడు భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీన కేసు నమోదు చేసినప్పటికీ నిందితుడి అరెస్ట్‌లో జాప్యం జరుగుతోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకునేందుకు బాధితురాలిపైనే తిరిగి కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన విచారించి నిందితుడికి శిక్ష పడేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బంక ఝాన్సీ, దుర్గాసి రమణమ్మ, నాగూర్ బి.అనిత, మురళి తదితరులు పాల్గొన్నారు.
క్లీనర్ మృతి, డ్రైవర్‌కు గాయాలు
పెదకాకాని: జాతీయ రహదారిపై వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన బుధవారం పెదకాకాని వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు మండలం, బద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు కడప జిల్లా మైదుకూరులో విత్తన పసుపు కొమ్ములు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి లారీ బాడుగకు మాట్లాడుకుని ఆ విత్తన పసుపు కొమ్ములను లారీలో లోడు చేయించారు. పసుపు కొమ్ములతో బయలుదేరిన బుధవారం ఉదయం పెదకాకాని సమీపంలోకి చేరుకుంది. లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి ప్రక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని ఫల్టీ కొట్టింది. లారీలో ఉన్న పసుపు కొమ్ములు రోడ్డుపై చెల్లా చెదురుగా పడటంతో వెనుక నుంచి వెళుతున్న వాహనాలు తొక్కుకుంటూనే ప్రయాణాలు సాగించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కుమార్, క్లీనర్ ప్రసన్నకుమార్‌లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లీనర్ ప్రసన్నకుమార్ పరిస్థితి విషమంగా మారడంతో చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రసన్నకుమార్(24) మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెదకాకాని పోలీసులు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పసుపు కొమ్ములను ఒక చోటకు చేర్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతుని సోదరుడు రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టిపి నారాయణస్వామి తెలిపారు.


