బెజవాడలో దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

బెజవాడలో దారుణ హత్య

May 15 2026 10:50 AM | Updated on May 15 2026 10:50 AM

బెజవాడలో దారుణ హత్య

భార్యతో గొడవపడి ఇంటికి వచ్చిన దగ్గర బంధువుని హతమార్చిన యువకుడు

తన తల్లిని దూషించాడనే అక్కసుతో నాపరాయితో తలపై మోది హత్య

నిందితుడితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు యువకులు అరెస్ట్‌

అజిత్‌ సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): భార్యతో గొడవపడిన తనకు తలదాచుకునే చోటిస్తాడని బంధువు ఇంటికి వెళ్తే.. ఆ బంధువే తనను హతమారుస్తాడని తలచలేకపోయాడు. రోజంతా తన వెన్నంటి ఉన్న వ్యక్తే తన పాలిట యముడిగా మారతాడని ఊహించలేకపోయాడు.. మద్యం మత్తులో చేసిన అధిక ప్రేలాపన అతని ప్రాణం తీసింది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మీసాల కుమార్‌ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో బుధవారం సాయంత్రం ఏడీసీపీ జి.రామకృష్ణ, నార్త్‌జోన్‌ ఏసీపీ పి.సత్యానందం ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.

తల్లిని దూషించాడనే కక్షతో హత్య

అజిత్‌సింగ్‌నగర్‌ న్యూరాజరాజేశ్వరీపేట ప్రాంతానికి చెందిన మీసాల కుమార్‌ అలియాస్‌ గంజి కుమార్‌ అలియాస్‌ కృపారావు(36)కు మౌనిక అనే మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. కుమార్‌ మద్యానికి బానిసగా మారడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నెల 11న కూడా భార్యతో గొడవపడి కుమార్‌ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. తనకు కొడుకు వరుస అయ్యే న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన పంది ప్రసాద్‌ వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి ఆ రోజు వారింటి వద్దే తలదాచుకున్నాడు. 12వ తేదీన కూడా కుమార్‌, ప్రసాద్‌ ఇద్దరూ వాంబేకాలనీకి వెళ్లే దారిలో ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద పూటుగా మద్యం తాగారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో తిరిగి మళ్లీ ప్రసాద్‌ ఇంటికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న కుమార్‌ ప్రసాద్‌ తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ప్రసాద్‌ పక్కనే ఉన్న నాపరాయితో కుమార్‌ తలపై ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో తలపగిలి తీవ్ర రక్తస్రావమై కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

నిందితుల అరెస్టు

కుమార్‌ను హత్యచేసిన ప్రసాద్‌ తన ఆటోలో అక్కడి నుంచి పరారై న్యూఆర్‌ఆర్‌పేటకు చెందిన తన స్నేహితుడు మిండల ఏసు అలియాస్‌ చిన్నకొత్తెం, విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాప్‌రోడ్డు ప్రాంతానికి చెందిన మరో స్నేహితుడు గద్దల ప్రశాంత్‌కుమార్‌కు జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో వారు ముగ్గురూ ఆటోలో గాంధీనగర్‌కు చేరుకొని రక్తపు మరకలు అంటిన ప్రసాద్‌ దుస్తులను తీసివేసి మిండల ఏసు తన దుస్తులను ప్రసాద్‌కు ఇచ్చాడు. రక్తపు మరకలు అంటిన ప్రసాద్‌ దుస్తులను ఎవరికీ కనిపించకుండా దాచివేశారు. ఆటోలో రక్తపు మరకలు లేకుండా నీళ్లతో ముగ్గురూ కలిసి శుభ్రం చేశారు. కుమార్‌ హత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని, అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అరెస్ట్‌ చేసి న్యాయ స్థానం ఎదుట హాజరుపరిచారు. సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో బుధవారం సాయంత్రం పోలీసులు ముగ్గురు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఏడీసీపీ జి.రామకృష్ణ, నార్త్‌జోన్‌ ఏసీపీ పి.సత్యానందం హత్య వివరాలను వెల్లడించారు. సింగ్‌నగర్‌ సీఐ డి.చంద్రశేఖర్‌, స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement