పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు బుధవారం రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూల్ జాకెట్లు, కూల్ క్యాప్‌లను పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండల నుంచి ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఉపశమనం పొందేందుకు హ్యాట్స్, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్ల అద్దాలు, నెక్ బ్యాండ్ (చల్లగా గాలి రావడానికి) బ్యాగులతో కూడిన సమ్మర్ కిట్‌లను అందజేశామన్నారు. జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటివరకు 10,873 కెమెరాలను ఏర్పాటు చేశామని, ఇది ఒక రికార్డన్నారు. కేవలం కెమెరాలు పెట్టడమే కాకుండా, అవి పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక రియల్ టైమ్ అప్లికేషన్ అభివృద్ధి చేశామని, 10,873 కెమెరాలలో దాదాపు 97 శాతం కెమెరాలు (10,565) నిరంతరం పనిచేస్తున్నాయన్నారు.
నేరస్తులపై డేగ కన్ను
‘ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నేరస్తులకు ఏమాత్రం సురక్షితం కాదు‘ అనే నినాదంతో తాము ముందుకు వెళ్తున్నామని, 2025లో రికవరీ శాతం 84 శాతం ఉండగా, 2026 మొదటి నాలుగు నెలల్లో అది 86 శాతంకి పెరిగిందని, ఎఫ్.ఆర్.ఎస్. కెమెరాల ద్వారా నేరస్తులనే కాకుండా మూడేళ్ల క్రితం మిస్సింగ్ అయిన వ్యక్తిని కూడా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో అస్త్రం యాప్‌ను ఉపయోగించి ప్రతి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సాంద్రతను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నామన్నారు. గతంలో 20 నిమిషాలు వేచి ఉండే సమయాన్ని ఇప్పుడు 2 నిమిషాలకు తగ్గించామని, రాబోయే గంటల్లో లేదా మరుసటి రోజు ఏ జంక్షన్ వద్ద ఎంత ట్రాఫిక్ ఉండబోతుందో ఈ వ్యవస్థ ముందుగానే అంచనా వేస్తుందన్నారు. అనంతరం విధులలో విశేష ప్రతిభ కనపరిచిన అధికారులు, సిబ్బందిని ప్రశంసాపత్రాలతో అభినందించారు.
దాతలకు సత్కారం
సమ్మర్ కిట్లను అందించడానికి సహకరించిన దాతలు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్.బాలగోపాల్, సెక్రటరీ ఎం.రాంగోపాల్ రావు, లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు వి.వి.పి.ఎస్.ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డిలను సత్కరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం, సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న, ఏసీపీలు, సీఐలు, రోటరీ క్లబ్, లయన్స్‌క్లబ్ ప్రతినిధులు, ట్రాఫిక్ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


