పటమట(విజయవాడతూర్పు): అనాదిగా అన్ని రంగాలలో వెనుకకు నెట్టబడ్డ బీసీలకు సమస్త రంగాలలో జనాభా దామాషా మేరకు రాయితీలు రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. లబ్బీపేటలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నింటా వాటా, కోటాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా పంచి సామాజిక న్యాయం అందించాలని, బీసీల ప్రధాన డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 17న నగరంలోని బెంజి సర్కిల్ వద్ద నున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్‌లో బీసీల మేధో మథన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ చట్టసభలలో–మహిళా రిజర్వేషన్లలో– స్థానిక సంస్థలలో జనాభా దామాషా మేరకు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఓబీసీ సబ్ ప్లాన్ మేరకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలైన బీసీల రక్షణ చట్టం, 50 ఏళ్లకే సామాజిక పెన్షన్లు వెంటనే అమలు జరపాలన్నారు. బీసీ ఉద్యోగుల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. సమావేశంలో బీసీ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ఎన్ మూర్తి, ఎంప్లాయిస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు. ఉపాధ్యక్షుడు మల్కాపురం కనకారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మరీదు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


