ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రహదారి భద్రతపై ప్రతి ఒక్కరిలో అవగాహన, చైతన్యం పెరగాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన, పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శనివారం కలెక్టర్ తన చాంబర్‌లో ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించడంలో రవాణా, పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చునన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు వాహన చోదకుడుతో పాటు మిగిలిన వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. మితిమిరిన వేగంతో వాహనాలు నడపడం ప్రమాదాలకు దారి తీస్తాయన్నారు. వాహనం నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో అర్టీవోలు అర్.ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.


