సమ్మోహనం.. కూచిపూడి నాట్యం
కూచిపూడి(మొవ్వ): నాట్య క్షేత్రమైన కూచిపూడిలో గురువారం శ్రీ సిద్ధేంద్ర యోగి జయంతోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలు ప్రేక్షకులను సమ్మోహన పరిచాయి. అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో జయంతి ప్రసాద్–శాంత దంపతులు, తండా సురేష్ గౌడ్– స్వప్న దంపతుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాలు రసజ్ఞులైన ప్రేక్షకులను అలరించాయి. ముందుగా గ్రామ సర్పంచ్ కొండవీటి వెంకట రమణ విజయలక్ష్మి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వీరంకి జ్యోతి, పసుమర్తి మృత్యుంజయ శర్మ పలువురు కూచిపూడి భాగవతులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రాంభించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళా పీఠం విద్యార్థినులు అసిస్టెంట్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూర్వ రంగం, భామాకలాపం అంశాలను చక్కని హావభావాలతో ప్రదర్శించి రక్తి కట్టించారు. మువ్వ నృత్యరాగనిగమం (హైదరాబాద్) డాక్టర్ హిమబిందు కనోజ్ పర్యవేక్షణలో విద్యార్థినులు త్రయం హాసిని, కిన, ప్రణవి త్యాగరాజ స్వామి విరచిత అంశాలను ప్రదర్శించారు. శ్రీ సమ్మోహన ఆర్ట్ అకాడమీ (హైదరాబాద్) డాక్టర్ బోనాల కిరణ్మయి పర్యవేక్షణలో విద్యార్థిని సంచలన కృష్ణ ప్రహ్లాద పట్టాభిషేకం, పురందరదాసు కీర్తన ప్రదర్శించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. అఖిల భారత కూచిపూడి నాట్యకళామండలి విద్యార్థినులు పసుమర్తి మృత్యుంజయ శర్మ నిర్వహణలో కొప్పర్తి తేజ జగదీష్, మహాలక్ష్మి రాజా కూచిపూడి ప్రశస్తి, శివాష్టకం అంశాలను ప్రదర్శించారు. శ్రీశాంకరి డ్యాన్స్ మ్యూజిక్ అకాడమీ (హైదరాబాద్) డాక్టర్ నారపరాజు శ్రీలత శిష్యులు రిషిత, అనుశ్రీ , తీర్థన శ్రీవిఘ్నరాజంభజే, జయదేవుని అష్టపది, శివ స్తుతి అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
కనుల విందుగా
శ్రీ సిద్ధేంద్రయోగి జయంతోత్సవం
సమ్మోహనం.. కూచిపూడి నాట్యం


