సిందు స్నానాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
సాగరసంగమం వద్ద స్నానాలకు అనుమతి నిరాకరణ ‘హంసలదీవి స్పెషల్’ పేరుతో ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
కోడూరు: మాఘపౌర్ణమిని పురస్కరించుకుని హంసలదీవి సాగరతీరంలో సిందుస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీడీఓ సుధాప్రవీణ్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగే సిందుస్నానాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది. సముద్రస్నానాలు ఆచరించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తారని ఎంపీడీఓ తెలిపారు. ఈ ఏడాది సిందుస్నానాలు ఆదివారం రావడంతో యాత్రికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పవిత్ర కృష్ణా సాగర సంగమం ప్రాంతం వద్ద భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఏడాది భక్తులను అనుమతించడం లేదని అవనిగడ్డ సీఐ యువకుమార్ తెలిపారు. 130 పోలీసులు, ఆరుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు, 20మంది వలంటీర్లతో బందోబస్తు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 30, 31 ఫిబ్రవరి ఒకటో తేదీన అవనిగడ్డ డిపో నుంచి హంసలదీవి స్పెషల్ పేరుతో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు అవనిగడ్డ డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో సముద్రంలో పది మరబోట్లు, 60 మంది గజ ఈతగాళ్లతో పర్యాటకులకు భద్రత కల్పించనున్నట్లు ఆ శాఖ ఏడీ ప్రతిభ తెలిపారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో హంసలదీవి వేణుగోపాలస్వామి ఆలయం, తీరంలోని డాల్ఫిన్ భవనం వద్ద, బీచ్ ఒడ్డున రెండు వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామని వైదాధికారులు రాణీసంయుక్త, శీరిష తెలిపారు. 108 వాహనం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 150 మంది పారిశుద్ధ్య కార్మికులతో మూడు రోజుల ముందు నుంచే తీరంలో శానిటేషన్ పనులను ప్రారంభిస్తామని ఇన్‌చార్జీ ఈఓపీఆర్డీ ఏడుకొండలు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్, ఫైర్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే పనులపై ఆయా శాఖలాధికారులు సమావేశంలో వివరించారు. తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, ఫారెస్ట్ రేంజర్ శ్రీసాయి, కోడూరు ఎస్‌ఐ చాణిక్య, మైరెన్ ఎస్‌ఐ పూర్ణమాధురి తదితరులు పాల్గొన్నారు.


