ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు
మైలవరం: మహిళపై దాడి చేసి, ఆమె మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మైలవరం పోలీస్ స్టేషన్‌లో ఆయన బుధవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మైలవరం మండలం పుల్లూరు శివారు దాసుళ్లపాలెం గ్రామానికి చెందిన వి.అనిల్ తన భర్యకు ఫోన్ చేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన వింజమూరి లక్ష్మయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ రాత్రి సమయంలో అనిల్ ఇంటిపై తన కుమారుడు సనత్‌తో కలిసి లక్ష్మయ్య దాడి చేశాడు. అనిల్‌పై దాడి చేస్తుండగా అతని తల్లి సారమ్మ, తండ్రి మిస్సాకు అడ్డొచ్చారు. లక్ష్మయ్య రోకలి బండతో సారమ్మ తలపై కొట్ట డంతో ఆమె తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. మిస్సాకు, అనిల్ కూడా గాయపడ్డారు. సారమ్మను తొలుత మైలవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నెల 25వ తేదీన సారమ్మ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. 22వ తేదీన సారమ్మ భర్త మిస్సాకు ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద పోలీసులు నమోదు చేశారు. సారమ్మ మృతి చెందడంతో ఈ నెల 26వ తేదీన పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 27వ తేదీన పుల్లూరు సెంటర్ వద్ద లక్ష్మయ్య, సనత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ సుధాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


