సాగు ఖర్చులకు అనుగుణంగా పంట రుణాలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వివిధ పంటలు సాగు ఖర్చులకు అనుగుణంగా రైతులకు పంట రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఏవీఎస్‌రెడ్డి సమావేశ మందిరంలో కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (కేడీసీసీ) ఎన్టీఆర్ జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులు, ప్రగతిశీల రైతులు, బ్యాంకర్లు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయా పంటలకు రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)పై ప్రతిపాదనల రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎకరా మిర్చికి రూ.1.20 లక్షలు, పత్తికి రూ.60 వేలు, వరికి రూ.46 వేలు, మొక్కజొన్నకు రూ.45 వేల చొప్పున రుణాలను మంజూరు చేయాలని అనంతవరం గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు కె.నరసింహారావు కోరారు. కలెక్టర్ లక్ష్మీశ స్పందిస్తూ.. సమావేశం దృష్టికి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ ద్వారా 2026–27 సంవత్సరానికి రుణపరిమితిని ప్రతిపాదించామన్నారు. రైతుల ప్రయోజనాలను సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గతేడాది కంటే రుణపరిమితిని పెంచామన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు అదనంగా 30 శాతం వరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో కేడీసీసీ సీఈఓ ఎ.శ్యామ్‌మనోహర్, జీఎం రంగబాబు, ఎల్డీఎం ప్రియాంక, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, మత్య్స శాఖ అధికారి చక్రాణి, జిల్లా పశువర్ధక శాఖ అధికారి ఎం.హనుమంతరావు, ప్రగతిశీల రైతులు పి.నాగేశ్వరరావు, ఎ.అజయ్‌కుమార్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.


